విద్యా విధానంలో  మార్పు తెచ్చిన ఘనత మోదీదే : బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

విద్యా విధానంలో  మార్పు తెచ్చిన ఘనత మోదీదే : బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
  • మధిరలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుపై హర్షం
  • దేశంలోనే ఆదర్శ కాలేజీగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: జాతీయ విద్యా విధానంలో చరిత్రాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీదే అని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల బీజేపీ సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నాణ్యమైన ఉన్నత విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి విద్యాప్రమాణాలకు ఆయన ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని గ్రామీణ, గిరిజన, వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నూతన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం అందించాలని కోరారు. ఏఐసీటీఈ సహకారంతో ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ తరగతి గదులు, పరిశోధనా సౌకర్యాలు, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు, స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కేంద్రాలు, పరిశ్రమలతో భాగస్వామ్యం కల్పిస్తే ఈ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతుందని తెలిపారు.

దీనిని దేశంలోనే ఆదర్శ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించినట్లు గుర్తుచేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, రోబోటిక్స్, డేటా సైన్స్ వంటి నూతన సాంకేతిక రంగాల్లో 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.