హిందువులు.. పండుగులకు.. వ్రతాలు.. పూజలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆషాఢమాసం శూన్యమాసం. అయినా ఈ నెలలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఆషాఢం మాసం శుక్లపక్షం.. ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2026) జులై 25న వచ్చింది.ఆ రోజు కొన్ని ఉపచారాలు పాటిస్తే అదృష్టం మన తలుపు తడుతుందని పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజు ఏ రాశి వారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . . !
హిందూపురాణాల ప్రకారం ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే దేవశయని ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏకాదశి రోజున రాశుల వారీగా దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. తొలిఏకాదశి రోజు ( జులై 25) 12 రాశుల వారు కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మేషరాశి: విష్ణుమూర్తికి ఎర్రటి చందనం లేదా ఎర్రటి పువ్వులు సమర్పించాలి. ఆధ్యాత్మిక గ్రంధాలు ( రామాయణం, భగవద్గీత, భాగవతం)వంటి పుస్తకాలు, బెల్లం దానం చేయడం వలన శుభం జరగడంతో పాటు జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
వృషభరాశి: తొలి ఏకాదశి రోజు ఈ రాశి వారు లక్ష్మీనారాయణస్వామి వారికి చందనం సమర్పించి.. తులసి దళాలతో పూజ చేయాలి. స్వామి వారికి తెల్లటి పూలను సమర్పించాలి. స్వామివారికి పాయసం నైవేద్యంగా ఉంచాలి. ఈ రాశి వారు నెయ్యి.. పసుపురంగు వస్త్రాలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
మిథునరాశి: ఈ రాశి వారు తొలిఏకాదశి రోజు విష్ణుమూర్తి తులసిదళాలతో పూజించి.. విష్ణువుకు సంబంధించిన దేవాలయాలు దర్శించాలి..పేదలకు అన్నదానం చేయాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో పాటు ఆకుపచ్చని వస్తువులు దానం చేయాలి ఇలా చేయడం వలన వీరికి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.
కర్కాటకరాశి: లక్ష్మీనారాయణులను పూజించి పాలతో తయారు చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. పూజలో మత్యం ఉంచితే చాలా మంచిది. దీపారాధనకు వెండి కుందులను ఉపయోగించండి( ఆర్థిక పరిస్థితిని బట్టి) . ఈ రాశి వారు బియ్యం , పాలు, పెరుగు దానం చేయండి.
సింహరాశి: ఈ రాశి వారు స్వామి వారికి పసుపు రంగు స్వీట్లను సమర్పించండి.. గోధుమలు దానం ఇవ్వడం వలన ఈ రాశి వారికి విష్టుమూర్తి వలన ఉద్యోగం.. వ్యాపారం అభివృద్ది చెందుతుందని పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారు పంచామృతంతో స్వామి వారిని అభిషేకం చేయాలి. పేదలకు ఆకుపచ్చని రంగు వస్తువులను అవసరమైన వారికి దానం చేయడం వలన మనశ్శాంతి లభిస్తుంది. పంటలు సమృద్దిగా పండుతాయి.
తులారాశి: ఈరాశి వారు విష్ణు సహస్రనామం చదవాలి.. లేదా వినాలి. సుగంధ ద్రవ్యాలు .. ధనాన్ని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
వృశ్చికరాశి: ఈ రాశి వారు శ్రీహరి అనుగ్రహం కోసం విష్ణు ఆలయంలో పసుపు కొమ్ములను సమర్పించండి. ఎరుపు, పసుపు రంగు వస్తువులను దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
ధనుస్సురాశి: ఈ రాశి విష్ణుమూర్తి ఆశీస్సుల కోసం.. ఉపవాస దీక్షను పాటించి.. విష్ణు సంబంధ ఆలయాలను సందర్శించాలి. శనగపప్పు, బెల్లం దానం చేయడం వలన దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
మకరరాశి: ఈ రాశి వారు నారాయణుడి కృప కోసం స్వామివారికి చందనం సమర్పించాలి. స్వామి వారికి షోడసోపచార పూజలు చేయాలి. స్వామి వారికి శనగపిండితో చేసిన లడ్డూల నైవేద్యంగా సమర్పించి.. దానం చేయాలి.ఇంకా శనగలు.. పసుపు వస్త్రాలు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కుంభరాశి:ఈ రాశి వారికి శ్రీమహావిష్ణువు ఆశీస్సులు లభించాలంటే ఉపవాసం ఉండాలి. ఏకాదశి శనివారం రావడం వలన శని భగవానుడి నువ్వులు.. బెల్లం సమర్పించాలి. ఈ రాశి వారు పేదలకు అన్నదానం చేయాలి. బ్రాహ్మణుడికి వస్త్రాలు.. బియ్యం దానం చేయాలని పండితులు చెబుతున్నారు.
మీనరాశి: ఈ రాశి వారు లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో పూజించాలి. కేసరి కలిపిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రాశి వారు పసుపు రంగు పండ్లు దానం చేయాలని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవశయని ఏకాదశి .. తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. మోక్షాన్ని ప్రసాదించే ఈ రోజున దానం చేయడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
