నేపాల్ వరదల్లో స్టిల్ 275 మంది ఇండియన్స్ మిస్సింగ్: విదేశాంగ శాఖ

నేపాల్ వరదల్లో స్టిల్ 275 మంది ఇండియన్స్ మిస్సింగ్: విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: నేపాల్‎లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో ఇప్పటికీ 275 మంది భారత పౌరులు గల్లంతయ్యారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 166 మందిని రెస్య్కూ చేసినట్లు తెలిపింది. నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారి వివరాలను శుక్రవారం (సెప్టెంబర్ 4) విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వరదల్లో గల్లంతైన వారి కోసం నేపాల్‎ అధికారులతో భారత ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

 ఇప్పటికీ 275 మంది భారత పౌరులు ఆచూకీ తెలియకపోగా.. 166 మందిని నేపాల్ అధికారులు రెస్య్కూ చేశారని చెప్పారు. నేపాల్ అధికారుల సహయక చర్యలను అభినందిస్తున్నామన్నారు. నేపాల్ ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా సహాయాన్ని కొనసాగిస్తామని.. రాబోయే రోజుల్లో నేపాల్ ప్రభుత్వం అభ్యర్థించిన మరిన్ని ఫోరెన్సిక్ కిట్లు, బెయిలీ బ్రిడ్జ్‌లు, ఇతర సామగ్రిని పంపాలని యోచిస్తున్నామని తెలిపారు. 

గురువారం (సెప్టెంబర్ 3) 21 టన్నుల సహాయక సామగ్రితో రెండు భారతీయ విమానాలు కాఠ్మండుకు వెళ్లాయని.. ఇప్పటివరకు ఏడు విమానాలలో సుమారు 95 టన్నుల సహాయక సామగ్రిని సరఫరా చేశామని చెప్పారు. సహాయక సామగ్రితో పాటు రెస్క్యూ ఆపరేషన్ కోసం 54 మంది సిబ్బందిని కూడా పంపామని పేర్కొన్నారు. ఇందులో 30 మంది టన్నెల్ రెస్క్యూ నిపుణులు, 19 మంది ఫోరెన్సిక్ నిపుణులు, ఐదుగురు సభ్యుల వైద్య బృందం ఉందని చెప్పారు. రెస్క్యూ, ఫోరెన్సిక్ బృందాలు క్షేత్రస్థాయిలో నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. 

►ALSO READ | ఎస్టోనియా రక్షణ మంత్రి కొంపముంచిన భారత కంపెనీతో డీల్.. రూ.769 కోట్ల స్కాం అని తేలడంతో రాజీనామా !

నేపాల్‌లో సంభవించిన విపత్తుపై భారత్ ఒక మంచి మిత్రదేశంగా తక్షణమే స్పందించిందని.. అక్కడ జరుగుతున్న పునర్నిర్మాణ, పునరుద్ధరణ పనులకు ఇండియా తన పూర్తి మద్దతును కొనసాగిస్తుందని తెలిపారు. కాగా, 2026, ఆగస్ట్ 26న నేపాల్‎లో జలప్రళయం సంభవించిన విషయం తెలిసిందే. భారీ గ్లేసియర్ (మంచు కొండ) విరిగిపడటంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల ఉధృతికి ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ వరద వల్ల ఇప్పటి వరకు 1300 మందికి పైగా చనిపోగా.. వేల సంఖ్యలో జనం గల్లంతయ్యారు.