ఎస్టోనియా రక్షణ మంత్రి కొంపముంచిన భారత కంపెనీతో డీల్.. రూ.769 కోట్ల స్కాం అని తేలడంతో రాజీనామా !

ఎస్టోనియా రక్షణ మంత్రి కొంపముంచిన భారత కంపెనీతో డీల్.. రూ.769 కోట్ల స్కాం అని తేలడంతో రాజీనామా !

ఉక్రెయిన్‌కు మద్దతుగా 70 మిలియన్ యూరోల ఆయుధ సామగ్రి ఒప్పందానికి సంబంధించిన కుంభకోణం బయటపడటంతో.. యూరప్లోని ఎస్టోనియా దేశ రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్ రాజీనామా చేశారు. ఎస్టోనియా జాతీయ ఆడిట్ కార్యాలయం రిపోర్ట్ బయటపెట్టడంతో.. ఆ డీల్కు తాను బాధ్యత వహిస్తున్నానని చెబుతూ పెవ్‌కుర్ రాజీనామా చేశారు.

హన్నో పెవ్కుర్ 18 జూలై 2022 నుంచి ఎస్టోనియా రక్షణ మంత్రిగా పనిచేశారు. ఈ కుంభకోణం 2024లో ఎస్టోనియన్ సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంతకం చేసిన ఒప్పందాల దగ్గర మొదలైంది. ఈ ఒప్పందాలను డేటాసెల్ ఎస్ఆర్ఎల్ అనే ఇటాలియన్ సంస్థకు అప్పగించారు. దీనిని 2024లో మన దేశానికి చెందిన నెకో డిఫెన్స్ మునిషన్స్ కొనుగోలు చేసింది.

రష్యాతో యుద్ధ సమయంలో ఉక్రెయిన్ తీవ్రమైన మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంది.  దీంతో.. ఆ దేశానికి ఫిరంగి గుళ్లను సమకూర్చడానికి ఎస్టోనియా యూరోపియన్ యూనియన్ (EU) నిధుల నుంచి సుమారు 70 మిలియన్ యూరోలు చెల్లించింది. మన కరెన్సీలో రూ.769 కోట్లు. అయితే, ఈ కొనుగోలుపై ఎస్టోనియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

►ALSO READ | మిరాకిల్..తొమ్మిది రోజుల తర్వాత.. నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు

డేటాసెల్ లేదా నెకో సంస్థలకు గతంలో ఫిరంగి గుళ్లను తయారు చేసిన లేదా సరఫరా చేసిన రికార్డులు లేకపోవడంతో ఎస్టోనియా అధికారులు ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. ఎస్టోనియా ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి చట్టపరమైన చర్యలు ప్రారంభించడంతో పాటు, ఈ ప్రక్రియపై నేర విచారణ కూడా మొదలైంది.

మందు గుండు సామగ్రి నాణ్యతలో లోపం ఉందన్న ఆరోపణలను నెకో, డేటాసెల్ తిరస్కరించాయి. ఈ సమస్య యూరోపియన్ నిబంధనలు, నిధుల కేటాయింపులలోని మార్పులతో ముడిపడి ఉందని వారు వాదించారు. ముందస్తు చెల్లింపుల ద్వారా 59 మిలియన్ యూరోలు అందుకున్న తర్వాత, 58 మిలియన్ యూరోల విలువైన వస్తువులను పంపిణీ చేసినట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఈ మొత్తం కుంభకోణంలో మన దేశానికి చెందిన సంస్థ ప్రమేయం కూడా ఉండటంతో మన దేశ రక్షణ శాఖ కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.