కాలిఫోర్నియా: అమెరికాలో హృదయ విదారక ఘటన జరిగింది. కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వాళ్లు ముగ్గురూ హైదరాబాద్లోని సైదాబాద్ వాణినగర్‌కు చెందిన ఒకే కుటుంబంగా పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కుటుంబంలోని ఐదుగురు సభ్యులు కారులో ప్రయాణిస్తున్నారు. భార్యాభర్త, మరో ముగ్గురు చిన్నారులు కావడం గమనార్హం.
చనిపోయిన వారిని 19 ఏళ్ల యువతి హఫీజా నేహా షేక్, 14 ఏళ్ల బాలుడు హఫీజ్ ఒమర్.. 45 ఏళ్ల నజియా సల్మాగా పోలీసులు గుర్తించారు. 47 ఏళ్ల షేక్ అబ్దుల్ నవీద్‌తో పాటు.. ఐదేళ్ల చిన్నారి ఖదీజా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. నజియా భర్త షేక్ అబ్దుల్ నవీద్.. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌లో దాదాపు పదేళ్ల పాటు శాస్త్రవేత్తగా పనిచేశారు. ఈ కుటుంబం అమెరికాలో స్థిరపడినట్లు తెలిసింది. చనిపోయిన ముగ్గురి అంత్యక్రియలు జూలై 24న అమెరికాలోనే జరగనున్నాయని బంధువులు తెలిపారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ప్రస్తుతానికి తెలియలేదు.
