దేశంలో వీధి నిద్రలకు చరమగీతం పాడుతాం: బ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర్న్‌‌‌‌హామ్

దేశంలో వీధి నిద్రలకు చరమగీతం పాడుతాం: బ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర్న్‌‌‌‌హామ్
  • ప్రజల పురోగతిపై పెట్టుబడి పెట్టడమే ధ్యేయమని వ్యాఖ్య

లండన్: దేశంలో వీధి నిద్రలకు (రఫ్ స్లీపింగ్) చరమగీతం పాడుతామని బ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర్న్‌‌‌‌హామ్ వెల్లడించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేసిన తొలి ప్రసంగంలోనే ఆయన నిరాశ్రయుల సమస్య నిర్మూలనపై కీలక ప్రకటన చేశారు. ప్రజల వైఫల్యాలకు నిధులు వెచ్చించడం కంటే, వారి పురోగతిపై పెట్టుబడి పెట్టడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఈ బృహత్తర పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ.3,600 కోట్లు కేటాయించనుందని తెలిపారు. 

ఐదేండ్లలో 1,200 ఇండ్లను అందుబాటులోకి తేవడంతోపాటు రోడ్లపై జీవిస్తున్న 3,000 మందికి అత్యవసర వసతి, రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. గతంలో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌‌‌‌గా ఉన్నప్పుడు 'ఎ బెడ్ ఎవ్రీ నైట్' పథకం ద్వారా సాధించిన అనుభవాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే నిరాశ్రయుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. 

అయితే కన్సర్వేటివ్ పార్టీ షాడో మంత్రి సర్ జేమ్స్ క్లెవర్లీ స్పందిస్తూ.. మాంచెస్టర్‌‌‌‌లో బర్న్‌‌‌‌హామ్ ఈ హామీని నెరవేర్చలేకపోయారని, నిధుల కేటాయింపుపై స్పష్టత లేదని విమర్శించారు. మరోవైపు ప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ 'క్రైసిస్' సీఈఓ మ్యాట్ డౌనీ ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తూ దేశంలో నిరాశ్రయతకు చరమగీతం పాడేందుకు ఇదో గొప్ప అవకాశమని కొనియాడారు.