సెలబ్రిటీల జీవితాలపై ఫ్యాన్స్ ఎప్పుడూ ఎంతో ఆసక్తి చూపుతుంటారు. వారి జీవన విధానాన్ని, స్టైల్ ను ఫాలో అవుతూ ఆరా తీస్తుంటారు. ముఖ్యంగా ఇంత బిజీ లైఫ్ లో స్టార్ కిడ్స్ ను ఎవరు చూసుకుంటారు? వారి సంరక్షణ ఎలా ఉంటుంది. ? వంటి అంశాలపై తరచూ చర్చకు వస్తుంటాయి. లేటెస్ట్ గా అలాంటి చర్చ కు కేంద్ర బిందువుగా మారారు లలిత డిసిల్వా. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం నుంచి బాలీవుడ్ లో తైమూర్ అలీ ఖాన్, జెహంగీర్ అలీ ఖాన్ (జెహ్) నుంచి టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్ కారా కొణిదెల వరకు పలువురు స్టార్ కిడ్స్‌ను చూసుకున్న అనుభవజ్ఞురాలు ఆమె.
అనంత్ అంబానీ సంరక్షకురాలిగా..
మూడు దశాబ్దాలకు పైగా చిన్నారుల సంరక్షణలో అనుభవం ఉన్న లలిత.. తొలుత ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ నర్స్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం తన వైద్య అనుభవాన్ని ఉపయోగించుకుని ప్రైవేట్ కేర్‌గివర్‌గా మారారు. 1996లో ముఖేష్ అంబానీ-నీతా అంబానీ కుటుంబం ఆమెను తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ సంరక్షణ కోసం నియమించిందని చెబుతారు. దాదాపు 11-12 సంవత్సరాల పాటు అనంత్‌ను చూసుకున్న లలిత.. ఇప్పటికీ ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఆ తర్వాత కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌ను చూసుకోవడంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తైమూర్ ఎక్కడికి వెళ్లినా అతడిని జనసందోహం నుంచి కాపాడుతూ కనిపించిన లలిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. అనంతరం జెహంగీర్ (జెహ్) సంరక్షణ బాధ్యతలను కూడా ఆమెనే చేపట్టారు.
రామ్ చరణ్ కుమార్తె సంరక్షణ కోసం..
ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్ కారాను చూసుకుంటున్న లలిత.. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కొణిదెల కుటుంబాన్ని ప్రశంసించారు. ఉపాసన మేడమ్, రామ్ చరణ్ సర్ ఇద్దరూ తమ కుమార్తె విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు. నేను విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా వాళ్లే స్వయంగా బిడ్డను చూసుకుంటారు. వారు నిజంగా 'హ్యాండ్స్-ఆన్ పేరెంట్స్' అని ఆమె తెలిపారు.
నెల పారితోషికం ఎంతంటే?
లలిత పారితోషికంపై కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు తీసుకుంటారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వాటిని ఆమె ఖండించారు. అనుభవజ్ఞులైన కేర్‌గివర్లకు మంచి పారితోషికం ఉండటం సహజమే కానీ ప్రచారంలో ఉన్న సంఖ్యలు నిజం కావని స్పష్టం చేశారు.
24 గంటల బాధ్యత, అపారమైన ఓర్పు, చిన్నారుల ఆరోగ్యంపై నిరంతర శ్రద్ధ అవసరమయ్యే ఈ వృత్తిలో అనుభవమే అసలైన సంపద అని చెప్పారు.దశాబ్దాల అనుభవాన్ని మరో మెట్టు ఎక్కిస్తూ లలిత ఇప్పుడు సొంతంగా కేర్‌గివింగ్ ఏజెన్సీని కూడా ప్రారంభించారు. స్టార్ కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ 'సూపర్ నానీ'కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
