- రైతులకు మంత్రి తుమ్మల పిలుపు
హైదరాబాద్, వెలుగు: నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించగలమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భూసార పరిరక్షణ, నీటి సంరక్షణ, ప్రకృతి వనరుల సమర్థ వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
గురువారం సెక్రటేరియెట్ నుంచి ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, అసమాన వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలని సూచించారు.
రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులు వినియోగించాలని, రసాయన ఎరువులు, పురుగుమందులను మోతాదుకు మించి వాడకూడదని చెప్పారు. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు జీవ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల వాడకం, పంట మార్పిడి పద్ధతులపై గ్రామ స్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను
ఆదేశించారు.
డ్రిపే సేద్యాన్ని ప్రోత్సహించాలి
భూగర్భ జలాల సంరక్షణ కోసం డ్రిప్ సేద్యాన్ని ప్రోత్సహించాలని, అలాగే వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేందుకు ఫామ్ పాండ్స్ (పంట కుంటలు) ఏర్పాటు చేసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్‌కు చేయాలని, వ్యవసాయంతో పాటు పశుపోషణ, పశుగ్రాసం పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని తెలిపారు.
యంత్రాల వినియోగం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు అర్హులైన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్పీఓ)కు వ్యవసాయ పనిముట్లు అందిస్తామని వెల్లడించారు. సాగు భూముల పరిరక్షణ లక్ష్యంగా ‘ఖేత్ బచావో అభియాన్’ను ఒక నిరంతర ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.
జిల్లా వ్యవసాయ అధికారులు మండలాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని, దీని కోసం వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వండి
గండిపేట, వెలుగు: భవిష్యత్‌లో వ్యవసాయ రంగానిదే కీలక పాత్ర అని, రైతే రాజు అనే నమ్మకంతో వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు సవాలుగా మారుతున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
రానున్న నెలల్లో తాగు నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గురువారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు (ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్ ప్రోగ్రామ్)ను మంత్రి తుమ్మల ప్రారంభించి, మాట్లాడారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కేంద్రం ప్రభుత్వం చేపట్టిన ఖేత్ బచావో అభియాన్ కూడా రైతులకు చేరువ కావాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిశోధనల ఫలాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పూర్తిస్థాయిలో రైతులకు చేరడం లేదని, దీనిని అధిగమించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది నియామకాలు, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థుల స్టైపెండ్ పెంపు అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’కార్యక్రమ కరపత్రాన్ని, వర్సిటీ రెండేండ్ల ప్రగతిని వివరించే వీడియోను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య, నార్మ్ సంచాలకులు ఆర్‌ఎం సుందరం, ఇక్రిసాట్ శాస్త్రవేత్త హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.
