- మడగుడలో ఊపందుకున్న దండారి టోపీల తయారీ
- సంప్రదాయాన్ని బతికిస్తున్న మాడావి జైవంత్
బజార్ హత్నూర్, వెలుగు : ఆదివాసీల సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాల కోసం మాడగుడ గ్రామం ముస్తాబవుతోంది. ఉత్సవాల్లో దండారి నృత్యకారులు ధరించే ప్రత్యేక తలపాగాలు (టోపీలు) తయారీ పనులు జోరుగా సాగుతున్నాయి.
గ్రామానికి చెందిన మాడావి జైవంత్ అనే గిరిజన కళాకారుడు స్వయంగా నెమలి ఈకలతో ముందస్తుగా ఈ టోపీలను తయారు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రంగురంగుల ఈకలు, అద్దాలు, గజ్జెలను ఉపయోగిస్తూ కళాఖండాల్లా వీటిని రూపుదిద్దుతున్నారు. ప్రభుత్వం, గిరిజన శాఖ సంప్రదాయ కళాకారులను ప్రోత్సహిస్తే తమ సంస్కృతి మరింత కాలం పరిమళిస్తుందని జైవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
