ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ క్వార్టర్స్‌‌ కు సింధు, అష్మిత..ప్రపంచ రెండో ర్యాంకర్‌‌ యమగుచి పై అష్మిత సంచలన విజయం

ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ క్వార్టర్స్‌‌ కు సింధు, అష్మిత..ప్రపంచ రెండో ర్యాంకర్‌‌ యమగుచి పై అష్మిత సంచలన విజయం

పారిస్‌‌: ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నీలో భారత స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు, యువ క్రీడాకారిణి అష్మిత చలిహా మహిళల సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ ఫైనల్స్‌‌కు చేరారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్‌‌ ఫైనల్స్‌‌లో ఇద్దరూ వరుస గేముల్లో ప్రత్యర్థులను ఓడించారు. అన్‌‌సీడెడ్‌‌ అష్మిత 37 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌‌, మూడో సీడ్‌‌ అకానె యమగుచిపై 21-–19, 21-–18తో సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌‌లో రెండుసార్లు ఒలింపిక్‌‌ పతక విజేత సింధు 44 నిమిషాల్లో జపాన్‌‌ షట్లర్‌‌ రికో గుంజీని 21–-12, 21-–16తో ఓడించి తదుపరి రౌండ్‌‌కు అర్హత సాధించింది. 

మరోవైపు భారత ఆటగాళ్లు తన్వి శర్మ, ఆయుష్‌‌ శెట్టి ప్రీ క్వార్టర్స్‌‌లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌‌లో ప్రపంచ నంబర్‌‌వన్‌‌, టాప్‌‌ సీడ్‌‌ ఆన్‌‌ సె యంగ్‌‌ చేతిలో తన్వి 11-–21, 14-–21తో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌‌లో జపాన్‌‌కు చెందిన ఆరో సీడ్‌‌ కొడాయ్‌‌ నరావోకాతో మ్యాచ్‌‌లో గాయంతో బాధపడిన ఆయుష్‌‌ శెట్టి మధ్యలోనే వైదొలిగాడు. అప్పటికి అతడు 17-–21, 6-–11తో వెనుకబడి ఉన్నాడు. తొలి రౌండ్‌‌లో సహచర ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌‌ను ఓడించి ఆయుష్‌‌ రెండో రౌండ్‌‌కు చేరిన విషయం తెలిసిందే.