- చతులాపూర్లో డ్రింకింగ్ వాటర్ పంప్‌హౌస్ ప్రారంభం
- బొగ్గు ఉత్పత్తి, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: మందమర్రి ఏరియాలో మూసివేసిన కేకే-2 గని సమీపంలో సింగరేణి చేపట్టిన ఆయిల్పామ్ పైలట్ ప్రాజెక్టును సింగరేణి డైరెక్టర్ (పీపీ) కె.వెంకటేశ్వర్లు పరిశీలించి మొక్కలు నాటారు. సింగరేణి భవిష్యత్తు అవసరాలకు కీలకంగా మారనున్న శ్రావణపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పరిసర గ్రామాలనూ గురువారం పరిశీలించారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో పర్యటించి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు అభివృద్ధి పనులను సమీక్షించారు.
కేంద్ర ప్రభుత్వం 16వ విడత బొగ్గు బ్లాకుల వేలం జాబితాలో నెన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు గనిని చేర్చింది. ఈ గనిని దక్కించుకునేందుకు సింగరేణి బిడ్‌లో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ, ఇతర అధికారులతో కలిసి పాత బెల్లంపల్లి, అకినపల్లి, అవడం, మామిడిగట్టు, ఆదిల్‌పేట గ్రామాల పరిసరాలను డైరెక్టర్ పరిశీలించారు. అనంతరం మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల జీఎంలు రాధాకృష్ణ, ఎం.శ్రీనివాస్‌తో కలిసి కల్యాణిఖని, శ్రీరాంపూర్ ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా తీరును వ్యూపాయింట్ల నుంచి పరిశీలించారు.
తాగునీటి పంప్‌హౌస్ ప్రారంభం..
మందమర్రి పట్టణ ప్రజల తాగునీరు, ఇతర అవసరాల కోసం మూసివేసిన కేకే-1 గనిలోని నీటిని వినియోగించేందుకు చతులాపూర్లో ఏర్పాటు చేసిన పంప్‌హౌస్‌ను డైరెక్టర్, మందమర్రి జీఎం ప్రారంభించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో 6.5 టన్నుల సామర్థ్యం ఉన్న లోడర్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం రెండు ఏరియాల జీఎం కార్యాలయాల్లో బొగ్గు ఉత్పత్తి, ప్రాజెక్టుల పురోగతి, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశముందని సూచించారు. సింగరేణి భవిష్యత్ అవసరాలకు శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు కీలకమైందన్నారు. డైరెక్టర్ వెంట మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల ఏస్వోటు జీఎంలు జీఎల్ ప్రసాద్, కృష్ణ ప్రసాద్, ఇంజినీర్లు బాలాజీ భగవతి జా, సురేశ్, కేకే , ఎస్ఆర్పీ ఓసీపీల పీవోలు రాంబాబు, వెంకటేశ్వర్లు, కేకే, శాంతిఖని గనుల గ్రూప్ ఏజెంట్లు ఖాదిర్, సంతోష్‌కుమార్, డీజీఎలు అశోక్, నవీన్, మదీనా భాష, భూక్య దేశాయ్, గుర్తింపు సంఘం లీడర్లు ఉన్నారు.
