న్యూఢిల్లీ: జాతీయ జెండాను ఎగురవేయడానికి పౌరులకు ఎవరి అనుమతీ అవసరంలేదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) అధ్యక్షురాలు నేహా బోరా పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నెపంతో వ్యక్తిగత బాండ్ సమర్పించాలంటూ ఢిల్లీ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గురువారం జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్పై విచారణ జరిగింది. నేహా బోరా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. పోలీసుల నోటీసుకు చట్టబద్ధత లేదని పేర్కొన్నారు. “జెండా ఎగురవేసేందుకు పౌరులకు ఎలాంటి అనుమతులూ అక్కర్లేదు. నిజానికి పోలీసులకు ఈ విషయంలో చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉంది” అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
