రోజువారీ విద్యుత్ ఉత్పత్తిని 140 మిలియన్ యూనిట్లకు పెంచాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రోజువారీ విద్యుత్ ఉత్పత్తిని 140 మిలియన్ యూనిట్లకు పెంచాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •  మూతపడిన ఫ్యాక్టరీల విద్యుత్ 
  •     బకాయిల కోసం వన్ టైమ్ సెటిల్మెంట్
  •     యాదాద్రి ప్లాంట్కు నవంబర్​ నుంచి కోలిండియా బొగ్గు: డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ ఉత్పత్తిని 140 మిలియన్​ యూనిట్లకు పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్​శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సెక్రెటరియెట్​లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, బకాయిల అంశాలపై సమీక్షించారు. ఎల్​నినో ప్రభావంతో జల విద్యుత్ ఉత్పత్తి తగ్గగా.. రానున్న రోజుల్లో డిమాండ్ మేరకు కరెంట్​కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

ప్రస్తుతం రోజువారీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సగటున 91 మిలియన్ యూనిట్లకు చేరిందని, ఇటీవల ఒక్కరోజులోనే 118 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నమోదైందని ఆఫీసర్లు వివరించారు. రోజుకు 140 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికతో ముందుకెళ్లాలని డిప్యూటీ సీఎం సూచించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 2 యూనిట్లకు నవంబర్​నుంచి కోలిండియా బొగ్గు సరఫరా అవుతుందని చెప్పారు. 

ఫ్యాక్టరీల ఓనర్లకు అవగాహన కల్పించండి
రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలకు సంబంధించి పెండింగ్ విద్యుత్ బకాయిల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా అవకాశం ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. ఫ్యాక్టరీల ఓనర్లకు అవగాహన కల్పించాలని డిస్కమ్ ల​సీఎండీలను ఆదేశించారు. ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, జెన్కో సీఎండీ హరీశ్, ట్రాన్స్​కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్​వి.పాటిల్, ఆర్పీడీసీఎల్​సీఎండీ ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు.