- గల్ఫ్ దేశాల్లో మళ్లీ యుద్ధ మేఘాలు
టెల్ అవీవ్/టెహ్రాన్: హార్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. బుధవారం రాత్రి క్షిపణి దాడుల కారణంగా జలసంధిలో ఏడు చమురు ట్యాంకర్లు దగ్ధమయ్యాయని ఇరాన్ గురువారం వెల్లడించింది. పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ ముంచుకొస్తోందన్న భయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఒకేసారి ఇన్ని నౌకలపై దాడులు జరగడం అంతర్జాతీయంగా కలకలం సృష్టించింది. ఇజ్రాయెల్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అధికారం కోల్పోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు, వచ్చే నెలలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలపై ఓటర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నెతన్యాహు మళ్లీ స్పష్టమైన విజయం సాధిస్తే ఇరాన్‌పై దాడి దాదాపు ఖాయమని ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ పరిశోధకుడు డానీ సిట్రిన్వొవిజ్ తెలిపారు. ఈ ప్రాంతం మరో తీవ్ర సైనిక ఘర్షణ దిశగా పయనిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా సైనిక స్థావరాలపై ప్రతి దాడులు: ఇరాన్
హార్మూజ్ లో తాజా దాడులపై ఇరాన్ అధికారిక టెలివిజన్ స్పందించింది. ఈ వార్తలను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. వాణిజ్య నౌకలకు అమెరికా సాయం అందిస్తే ఆ దేశ సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ నౌకాదళం మరోసారి హెచ్చరించింది. జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతోందని ఇరాన్ స్పష్టం చేసింది.
మరోవైపు, టెహ్రాన్ ప్రభుత్వం దౌత్య చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే తమ దేశాన్ని రక్షించుకోవడానికి తాము వెనుకాడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన యుద్ధం ద్వారా తాము కీలకమైన సైనిక పాఠాలు నేర్చుకున్నామని హెచ్చరించారు. కాగా, అమెరికా ఈ ప్రాంతానికి అదనపు యుద్ధ విమానాలు, మూడో విమాన వాహక నౌకతోపాటు వేలాది మంది సైనికులను తరలిస్తోంది.
