ప్రియాంక కొడుకు ఫొటో ఎగ్జిబిషన్కు అడ్డంకులు

ప్రియాంక కొడుకు ఫొటో ఎగ్జిబిషన్కు అడ్డంకులు

 

  • పలు చిత్రాలను తొలగించిన బికానేర్ హౌస్ సంస్థ
  • దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంస్థ తీరు
  • భావప్రకటన స్వేచ్ఛ అణచివేతే.. ప్రియాంక గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా ఫొటో ఎగ్జిబిషన్ ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ పట్ల బికానేర్ హౌస్ సంస్థ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రదర్శనలో ఉంచిన 75 ఫొటోలను తొలగించడంపై పలువురు మండిపడుతున్నారు. 

యువత, విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలకు సంబంధించిన ఫొటోలతో పాటు త్రివర్ణ పతాకం ఉన్న ఫొటోలనూ అనుమతించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ట్  అనేది చాలావరకు రాజకీయాలతో కూడుకున్నదేనని, రాజకీయ కంటెంట్ ను అనుమతించబోమని ఓ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ చెప్పడం సరికాదని రేహాన్ వాద్రా వ్యాఖ్యానించారు.

వివాదం ఇదే..

బికానేర్ హౌస్​లో రేహాన్ వాద్రా మొత్తం 105 ఫొటోలతో సోలో ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. వీటిలో ఎక్కువ శాతం చిత్రాలు గత కొన్ని నెలలుగా ఢిల్లీతోపాటు వివిధ ప్రాంతాల్లో యువత, విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఉద్యమాలు, సామాజిక పరిస్థితులకు సంబంధించినవే. ఈ క్రమంలో ఎగ్జిబిషన్ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు బికానేర్ హౌస్ యంత్రాంగం రంగంలోకి దిగి.. ఈ ఫొటోలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ప్రదర్శనలో ఉన్న రాజకీయ, నిరసనల చిత్రాలు తమ సంస్థ మార్గదర్శకాలకు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ సుమారు 75కు పైగా ఫొటోలను తొలగించాలని ఆదేశించింది. దీంతో నిర్వాహకులు అనివార్యంగా ఆ చిత్రాలను ప్రదర్శన నుంచి వేరు చేయాల్సి వచ్చింది. భారత జాతీయ జెండా (త్రివర్ణ పతాకం) ఉన్న రెండు ఫోటోలను కూడా తొలగించాలని సిబ్బంది కోరినట్లు రేహాన్ వాద్రా ఆరోపించారు. 

దీనిపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దేశ జాతీయ జెండాకు సంబంధించిన చిత్రాలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించేది లేదని స్పష్టం చేశారు. అయితే, చివరికి ఎగ్జిబిషన్ పూర్తిగా రద్దు కాకుండా ఉండేందుకు కేవలం ప్రకృతి, వన్యప్రాణులకు సంబంధించిన ఇతర చిత్రాలతో మాత్రమే ప్రదర్శనను కొనసాగించవలసి వచ్చింది.

భావప్రకటనా స్వేచ్ఛపై దాడి: ప్రియాంక గాంధీ

తన కుమారుడి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌లో చిత్రాలను తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో యువత గొంతును, కళాకారుల భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్యం కాదు. ఒక కళాకారుడు తన కంటితో చూసిన వాస్తవాలను, జరుగుతున్న పరిణామాలను ఫొటోల రూపంలో వ్యక్తీకరిస్తే అడ్డుకుంటున్నారు. ఈరోజు నా కుమారుడికి జరిగింది, రేపు మరొక కళాకారుడికి జరుగుతుంది’ అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.