- సీసీఐ కేంద్రాలు 133కు పెంపు
- 335 జిన్నింగ్ మిల్లులు నోటిఫై
- క్వింటాల్‌కు రూ.8,667 ఎమ్మెస్పీ
- మార్కెట్లో ప్రస్తుతం రూ.9 వేల ధర
- కపాస్ కిసాన్ యాప్‌లో 12.75 లక్షల మంది రైతుల వివరాల నమోదు
హైదరాబాద్, వెలుగు: వానాకాలం పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు, కొనుగోళ్లలో జాప్యం లేకుండా మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చర్యలు చేపట్టాయి. గత సీజన్లో 122గా ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఈసారి 133కు పెంచారు. రాష్ట్రంలో 356 జిన్నింగ్ మిల్లులుండగా.. 30 జిల్లాల్లో 335 మిల్లులను కొనుగోళ్ల కోసం నోటిఫై చేశారు. రైతులకు ధరల భరోసా కల్పించాలని, కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం పత్తి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది. ప్రస్తుతం మోడల్ మార్కెట్ ధర రూ.9 వేల వరకు ఉంది. ఇది మద్దతు ధర కంటే రూ.333 ఎక్కువ. అయితే మార్కెట్ ధరలు, పత్తి నాణ్యత, తేమ శాతాన్ని బట్టి రైతులకు లభించే ధర మారుతుంది. ధరల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
48.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 48.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 29.43 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని భావిస్తున్నది. ఎల్‌నినో సహా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దేశవ్యాప్తంగా దిగుబడులు తగ్గే అవకాశాల నేపథ్యంలో రాష్ట్రంలో కొనుగోళ్ల నిర్వహణ కీలకంగా మారింది. మార్కెట్లో పత్తి ధర మద్దతు ధర కంటే ఎక్కువగా ఉంటే రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ధర తగ్గి మద్దతు ధర కంటే దిగువకు వస్తే సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పరీక్షలు, జిన్నింగ్, బేళ్ల తయారీ, గోదాములకు రవాణా, సకాలంలో చెల్లింపులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. మార్కెట్ ధరలు, కొనుగోళ్ల పురోగతి, రైతుల ఇబ్బందులను ఈ కమిటీలు సమీక్షిస్తాయి.
టోల్ ఫ్రీ, వాట్సాప్‌తో సమాచారం..
పత్తి కొనుగోళ్లలో పారదర్శకత కోసం కపాస్ కిసాన్ యాప్‌లో రైతుల వివరాలను నమోదు చేసి ధ్రువీకరిస్తున్నారు. అక్టోబర్ 21, 2026 నాటికి 12,75,185 మంది రైతులకు సంబంధించిన 21,58,938 వివరాలను యాప్‌తో అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునే ముందు యాప్‌లో తమ వివరాలను సరిచూసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాకు నిర్ణయించిన సగటు దిగుబడి కంటే ఎక్కువ పత్తి పండించిన రైతులు అదనపు దిగుబడి ధ్రువీకరణ కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ను సంప్రదించాలి. కౌలు రైతులు కూడా భూమి, ఆధార్, మొబైల్ వివరాలతో ఏఈవోను కలిసి పేర్లు నమోదు చేసుకోవాలి. భూ యజమాని ధ్రువీకరణ తర్వాతే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. రైతుల సందేహాల నివృత్తికి మార్కెటింగ్ శాఖ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చింది. 1800-599-5779 టోల్‌ఫ్రీ నంబర్, 8897281111 వాట్సాప్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
పత్తి ఆధారిత పరిశ్రమల విస్తరణపై దృష్టి
గుజరాత్, మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో పత్తి గింజల ప్రాసెసింగ్ యూనిట్లు, స్పిన్నింగ్ పరిశ్రమల సంఖ్య, సామర్థ్యం తక్కువగా ఉండటం ధరలపై ప్రభావం చూపుతోందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పత్తి ప్రాసెసింగ్, స్పిన్నింగ్, ఆయిల్ పరిశ్రమల విస్తరణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతులకు ధరల భరోసా కల్పించాలి: తుమ్మల
పత్తికి గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోళ్లలో జాప్యం నివారించడం ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సెక్రటేరియట్లో మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బహిరంగ మార్కెట్లో పత్తి ధరలను ప్రతిరోజూ సమీక్షించాలని, ఇతర రాష్ట్రాలతో ధరల్లో వ్యత్యాసాలకు కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా సీసీఐ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, పత్తి నాణ్యత దెబ్బతినకుండా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కొనుగోళ్లలో పారదర్శకత, సకాలంలో చెల్లింపులు, మెరుగైన సౌకర్యాల కల్పనతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
