స్మృతి మంధానకు అండగా ఉంటా..వైస్‌‌ కెప్టెన్సీ బాధ్యతను సవాల్‌‌ గా స్వీకరిస్తున్నా: దీప్తి శర్మ

స్మృతి మంధానకు అండగా ఉంటా..వైస్‌‌ కెప్టెన్సీ బాధ్యతను సవాల్‌‌ గా స్వీకరిస్తున్నా: దీప్తి శర్మ

వడోదరా: భారత మహిళల జట్టు వైస్‌‌ కెప్టెన్‌‌గా కొత్త బాధ్యతలను సవాల్‌‌గా స్వీకరిస్తున్నానని ఆల్‌‌రౌండర్‌‌ దీప్తి శర్మ తెలిపింది. జట్టు కెప్టెన్‌‌ స్మృతి మంధానకు సాధ్యమైనంత సహకారం అందిస్తూ, మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. జింబాబ్వేతో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌‌కు ముందు గురువారం ఆమె మీడియాతో మాట్లాడింది. హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మంధానకు భారత మహిళల వన్డే, టీ20 జట్ల పగ్గాలు అప్పగించారు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌‌కు దీప్తిని వైస్‌‌ కెప్టెన్‌‌గా నియమించారు. 

“కొత్త బాధ్యత వచ్చినప్పుడు దాన్ని సవాల్‌‌గా తీసుకుంటా. జట్టులోని ఇతర ఆటగాళ్లకు వీలైనంత సహాయం చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఆటగాడిగా ఉన్నా, వైస్‌‌ కెప్టెన్‌‌గా ఉన్నా జట్టు ఎక్కువ మ్యాచ్‌‌లు గెలవడమే నా లక్ష్యం” అని ఆమె చెప్పింది.వడోదరా పిచ్‌‌ బ్యాటింగ్‌‌కు అనుకూలంగా ఉంటుందని, టాస్‌‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌‌ చేస్తే 300కుపైగా పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తామని దీప్తి తెలిపింది. తుది జట్టు కూర్పును మ్యాచ్‌‌కు కొద్దిసేపు ముందే నిర్ణయిస్తామని పేర్కొంది. అనవసర మార్పులు చేయకుండా, ఇప్పటివరకు బాగా ఆడిన విధానాన్నే కొనసాగించాలనుకుంటున్నామని చెప్పింది.