లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘జయహో రామానుజ’. సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మించారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్‌గా నటించగా, సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 24న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వేణుగోపాలాచారి, డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, ఏపీ ఫిలింఛాంబర్ అధ్యక్షులు ఎం. శ్రీనివాస్ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
ఈ సందర్భంగా లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ ‘చిన్నప్పుడు రామానుజాచార్యుల గురించి చదువుకున్నా. ఆ తర్వాత కొన్నేళ్లకు పత్రికలకు రామానుజాచార్యుల వారి కథలను రాసి పంపించాను. అప్పుడే ఏదో ఒక రోజు ఆయన జీవిత కథను సినిమాగా రూపొందించాలనే సంకల్పం ఏర్పడింది. కానీ నేనే ఆ సినిమాలో రామానుజాచార్యుల వారిగా నటిస్తానని ఊహించలేదు.
కులం లేదు మతం లేదు మనుషులంతా ఒక్కటే అని చాటిన మహనీయుడు ఆయన. ప్రేక్షకులంతా మా సినిమాను ఆదరించాలి. రామానుజాచార్యుల వారి గురించి తెలుసుకోవాలి’ అని అన్నారు. ఈ సినిమాను రూపొందించడం ఒక ఎత్తు అయితే అది రిలీజ్ చేయడం మరో ఎత్తు అని నటి, నిర్మాత ప్రవళ్లిక అన్నారు.
