- ఆర్చరీలో శీతల్ దేవికి రెండు స్వర్ణాలు
- అథ్లెటిక్స్‌లోనే 52 పతకాలు..
నగోయా : ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఆర్చరీలో చేతులు లేని భారత స్టార్ శీతల్ దేవి రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. అథ్లెటిక్స్‌లోనూ భారత క్రీడాకారులు సత్తాచాటడంతో గురువారం నాటికి భారత్ ఖాతాలో మొత్తం 88 పతకాలు చేరాయి. వీటిలో 21 స్వర్ణాలు, 26 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. అథ్లెటిక్స్ విభాగంలోనే భారత్‌కు 52 పతకాలు లభించడం విశేషం.
రెండు గంటల్లో రెండు స్వర్ణాలు
19 ఏళ్ల ప్రపంచ చాంపియన్ శీతల్ దేవి మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణాలు సాధించింది. తొలుత తోటి ఆర్చర్ తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో ఇండోనేషియా జోడీని 151-–148తో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. అనంతరం వ్యక్తిగత ఫైనల్లో సింగపూర్‌కు చెందిన అలిమ్ నూర్ షాహిదాను 142–-139తో ఓడించింది. హాంగ్‌జౌలో 2023లో జరిగిన ఫైనల్‌లోనూ శీతల్ ఇదే ప్రత్యర్థిపై విజయం సాధించింది. మరోవైపు, మహిళల వ్యక్తిగత డబ్ల్యూ1 విభాగంలో స్వాతి చౌధరి రజతం గెలిచింది. ఈ విభాగంలో ఆసియా పారా గేమ్స్ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.
అథ్లెటిక్స్‌లో అదరగొట్టిన భారత అథ్లెట్లు
మహిళల ఎఫ్54 డిస్కస్ త్రోలో సువర్ణ రాజ్ 15.66 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం గెలిచింది. పురుషుల హైజంప్ టీ63 విభాగంలో శైలేష్ కుమార్ 1.89 మీటర్ల గేమ్స్ రికార్డుతో పసిడి సాధించాడు. వరుణ్ భాటి రజతం, రాహుల్ కాంస్యం గెలిచి భారత్‌కు మూడు పతకాలు అందించారు. మహిళల 400 మీటర్ల టీ47 పరుగులో అంజనాబెన్ బుంబాడియా స్వర్ణం, జయంతి బెహెరా రజతం సాధించారు. పురుషుల 400 మీటర్ల టీ47లో దిలీప్ మహదు గావిట్ 48.27 సెకన్లతో పసిడి గెలిచాడు. లాంగ్‌జంప్‌లో ధర్మరాజ్ సొలైరాజ్ 7.15 మీటర్ల ఆసియా రికార్డుతో స్వర్ణం నిలబెట్టుకున్నాడు. మహిళల 400 మీటర్ల టీ12లో తేజల్‌బెన్ దామోర్ రజతం సాధించింది.
స్విమ్మింగ్‌లో రవికి హ్యాట్రిక్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల దృష్టిలోపం ఉన్న స్విమ్మర్ రవి బుడిగినా పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో 25.89 సెకన్లతో కాంస్యం సాధించాడు. దీంతో ఈ గేమ్స్‌లో అతడి పతకాల సంఖ్య మూడుకు చేరింది. గతంలో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, ఫ్రీస్టైల్‌లో రజతాలు గెలిచాడు. స్విమ్మింగ్‌లో కపిల్ కుమార్ రజతం, స్వాతిక్ పాటిల్, తేజస్ నందకుమార్ కాంస్యాలు సాధించారు. దీంతో ఈ విభాగంలో భారత్ పతకాల సంఖ్య 10కు చేరింది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3లో భారత షట్లర్లు ప్రమోద్ భగత్, నితేశ్ కుమార్ ఫైనల్‌కు చేరడంతో భారత్‌కు స్వర్ణం, రజతం ఖాయమయ్యాయి. సెమీఫైనల్లో ప్రమోద్ భగత్ దక్షిణ కొరియా ఆటగాడు లీ సియుంఘును 16-–21, 21–-18, 21–-17తో ఓడించాడు. నితేశ్ కుమార్ ఇండోనేషియా ఆటగాడు ఎం. ఇమ్రాన్‌పై విజయం సాధించాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌ఎల్3-ఎస్‌యూ5లోనూ నితేశ్, తులసిమతి మురుగేశన్ జోడీ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4లో నవీన్ శివకుమార్ కూడా తుదిపోరుకు అర్హత సాధించాడు. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఎక్స్‌డీ7 సెమీఫైనల్లో ఓడిన భవినా పటేల్, శుభమ్ వాధ్వా కాంస్యంతో సరిపెట్టుకున్నారు.
