యువతితో అసభ్య ప్రవర్తన ..బిల్డింగ్ పై నుంచి తోసేసిన జిమ్ ట్రైనర్

యువతితో అసభ్య ప్రవర్తన ..బిల్డింగ్ పై నుంచి  తోసేసిన జిమ్ ట్రైనర్
  • తల పగిలి చనిపోయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి..చిక్కడపల్లిలో ఘటన 

ముషీరాబాద్,వెలుగు : ఎదురింటి ఫ్లాట్​లో ఉండే యువతిపై ఓ డీఆర్డీవో ఉద్యోగి లైంగికదాడికి ప్రయత్నించగా..అతడిని కొట్టి బిల్డింగ్​పై నుంచి తోసేశాడో యువకుడు. దీంతో తల పగిలి తీవ్రంగా గాయపడ్డ అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

డీఆర్​డీవోలో పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాంమోహన్​(55) చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలోని ఓ అపార్ట్​మెంట్​ఫస్ట్​ఫ్లోర్​లో రెండు సంవత్సరాలుగా కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. ఇతడు కొద్ది రోజులుగా ఇంటి పక్కనే ఉన్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి.  

బుధవారం రామ్మోహన్ కుటుంబ సభ్యులు దసరాకు కరీంనగర్‌ వెళ్లగా ఆయన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్నారు.  అదే అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో ఉంటున్న 22 ఏండ్ల యువతి తల్లి, సోదరి బయటకు వెళ్లడం గమనించాడు. వెంటనే ఆమె ఫ్లాట్​కు వెళ్లి మంచినీళ్లు అడిగి తాగాడు. వెళ్లిపోయాక కొద్దిసేపటికి మళ్లీ స్వీట్స్​తో వచ్చాడు. 

అయితే, ఆ యువతి నిరాకరించగా, ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో భయపడ్డ ఆమె గట్టిగా కేకలు వేసింది. వెంటనే పక్క బిల్డింగ్​లో ఉండే 35 ఏండ్ల జిమ్​ట్రైనర్​అభిజిత్​కు చెప్పింది.  వెంటనే అతడు రాంమోహన్​ఫ్లాట్​కు వెళ్లి ఈ విషయమై నిలదీశాడు. 

ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన రాంమోహన్​ ముఖంపై బలంగా కొట్టాడు. తర్వాత కోపంతో తోసెయ్యగా, బిల్డింగ్​పై నుంచి పడిపోయాడు. దీంతో రాంమోహన్ తీవ్రంగా గాయపడగా ఓ ప్రైవేట్​దవాఖానకు తరలించారు. 

అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. రాంమోహన్​ భార్య కాత్యాయిని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చిక్కడపల్లి సీఐ మధుబాబు తెలిపారు. అభిజిత్​ను అదుపులోకి తీసుకున్నారు.