విద్యార్థులపై పోలీసుల దాడులకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఇంటి ముట్టడి సందర్భంగా రాహుల్ అరెస్ట్ ను ఖండిస్తూ తెలంగాణవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన తీరుపై ఆగ్రహించిన కాంగ్రెస్శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళన చేశారు. ప్రధాని మోదీని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. జిల్లాలోని నకిరేకల్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు నిజామాబాద్ జిల్లాలో కూడా రాహుల్ అరెస్టును ఖండిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నగరంలోని గాంధీ చౌక్ లో ధర్నా చేశారు. వర్షంలోనే కార్యకర్తలు ఆందోళన చేశారు. బిజెపికి, ప్రధాని మోదికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిర్మల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ని శివాజీ చౌక్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ధర్నాలో మాజీ మంత్రి , కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి.రాహుల్అరెస్టుకు నిరసనగా సంగారెడ్డి జాతీయ రహదారిని దిగ్భంధించారు కాంగ్రెస్ నేతలు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో హైదరాబాద్, ముంబై హైవైపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఇంటి దగ్గర ధర్నా సందర్భంగా అరెస్ట్ అయిన పార్లమెంట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, నేతలు ఖర్గే,ప్రియాంకగాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. అరెస్ట్ సందర్బంగా రాహుల్ గాంధీపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. పోలీసుల దాడిలో రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్త స్రావం అయింది. కంటికి, చేతికి గాయాలయ్యాయి. కాక్రోచ్నిరసనల క్రమంలో ఫస్ట్ టైం ప్రధాని ఇంటిని ముట్టడించారు కాంగ్రెస్ నేతలు.
