పోలీస్ స్టేషన్‎లో ప్రియాంక.. కూతురు కోసం హుటాహుటిన పీఎస్‎కు సోనియా

పోలీస్ స్టేషన్‎లో ప్రియాంక.. కూతురు కోసం హుటాహుటిన పీఎస్‎కు సోనియా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మంగళవారం (జులై 21) రాత్రి ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లారు. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నాకు దిగిన ఎంపీ ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‎లో నిర్భంధించారు. ఈ నేపథ్యంలో తన కూతురు, ఎంపీ ప్రియాంకను కలిసేందుకు సోనియా గాంధీ హుటాహుటిన మందిర్ మార్గ్ స్టేషన్‎కు వెళ్లారు.

మరోవైపు.. తమ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని నిర్బంధించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ బయట భారీ ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. 

కాంగ్రెస్ మెరుపు ధర్నా:

పార్లమెంట్ మార్చ్ కార్యక్రమంలో కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం (జులై 21) ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి యత్నించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ఇంటి దగ్గరలో కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే భాగమై ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వ తీరును, పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు. ప్రధాని మోడీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసనలో భాగమైన కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, గొంతెత్తితే బేడీలు వేసి బంధిస్తుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

రాహుల్‏తో కేంద్ర మంత్రి చర్చలు:

మోడీ ఇంటి దగ్గర ధర్నాకు దిగిన రాహుల్ గాంధీతో కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. శాంతి భద్రతల దృష్ట్యా ధర్నా విరమించాలని రాహుల్ గాంధీని ఆయన కోరారు. అయితే, ధర్నా విరమించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు పెట్టింది. తమ డిమాండ్లపై కేంద్ర స్పష్టమైన ప్రకటన చేస్తే ధర్నా విరమిస్తామని రాహుల్ తెలిపారు.

అప్పటి వరకు ప్రధాని మోడీ ఇంటి ముందు నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాహుల్‎తో భేటీ అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేరుగా అమిత్ షా దగ్గరకు వెళ్లి ఆయనను కలిశారు. కాంగ్రెస్ డిమాండ్ల గురించి అమిత్ షాతో చర్చించారు. అమిత్ షాతో భేటీ అనంతరం మళ్లీ కాంగ్రెస్ ధర్నా స్థలానికి చేరుకుని రాహుల్‎తో జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ డిమాండ్ మేరకు.. నీట్ పేపర్ లీక్, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ గురించి పార్లమెంట్‎లో చర్చించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. 

అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. అదే తమ ప్రధాన డిమాండ్ అని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఈ అంశంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని రాహుల్ తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమి లేక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో మోడీ నివాసం ఎదుట హై టెన్షన్ నెలకొంది.