దీపాలు వెలిగించేందుకు పైసలుంటయ్.. బాలికల హాస్టళ్లకు ఉండవా..? మోడీ సర్కార్‌‌‌‌పై రాహుల్ గాంధీ ఫైర్‌‌‌‌‌‌‌‌

దీపాలు వెలిగించేందుకు పైసలుంటయ్.. బాలికల హాస్టళ్లకు ఉండవా..? మోడీ సర్కార్‌‌‌‌పై రాహుల్ గాంధీ ఫైర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో విద్యార్థినులకు సరైన హాస్టల్ వసతులు లేవని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థినుల కష్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండోర్‌‌‌‌లో నిర్వహించిన ‘చాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నను ప్రస్తావిస్తూ.. కేంద్రం తీరును రాహుల్‌‌‌‌గాంధీ ఎండగట్టారు. 

‘దీపాలు వెలిగించేందుకు ప్రభుత్వానికి నిధులుంటాయి కానీ, మేం ఉండే హాస్టళ్లకు మాత్రం డబ్బులు ఉండవా?’ అని ఇండోర్ సభలో పల్లెటూరు నుంచి చదువుకోవడానికి వచ్చిన ఓ విద్యార్థిని తనను అడిగిన విషయాన్ని రాహుల్ గుర్తుచేశారు. ప్రభుత్వ హాస్టళ్లు లేకపోవడంతో లక్షల రూపాయలు వెచ్చించి పీజీల్లో ఉండాల్సి వస్తోందని, నెలవారీ అద్దె భారం, ఎక్కడ ఖాళీ చేయిస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థినులు చదువుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన వసతి సౌకర్యాలు లేకే ఎంతోమంది విద్యార్థినులు ఉన్నత చదువులను మధ్యలోనే వదిలేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అరకొర హౌసింగ్ అలవెన్స్ ధరల పెరుగుదలకు తగినట్టు పెరగకపోగా, అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. ‘నరేంద్ర మోదీజీ.. ఆ చిన్నారి అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా?’ అని నిలదీశారు.

దేశంలో విద్యా వ్యవస్థ కుళ్లిపోయింది

దేశంలో విద్యా వ్యవస్థ కుళ్లిపోయిందని, ప్రశ్నించే విద్యార్థులంటే ప్రస్తుత పాలక వ్యవస్థకు భయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ వ్యవస్థకు ప్రశ్నించే విద్యార్థులు కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసే ‘అంధ భక్తులు’ మాత్రమే కావాలని విమర్శించారు. రాజ్యాంగ, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను కొద్దిమంది చేతుల్లోనే బందీ చేశారని, విద్యార్థులు నిలదీస్తేనే వ్యవస్థలో మార్పు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రంపై పవన్ ఖేరా ధ్వజం

రాహుల్ వ్యాఖ్యలకు మద్దతుగా కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘‘పీఆర్ ఈవెంట్లు, డిజైనర్ దుస్తులు, లగ్జరీ కార్లు, విమానాలకు మోదీ వద్ద నిధులుంటాయి కానీ, దేశ యువత విద్యకు మాత్రం ఉండవు’’ అని ఎద్దేవా చేశారు. దేశంలో మౌలిక వసతులు, నాణ్యమైన ఉపాధ్యాయులు, శిక్షణ, హాస్టళ్లు, ఉద్యోగాలు ఏవీ లేవని ఆరోపించారు.