బ్యాంక్ ఉద్యోగ సంఘాలు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా.. సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు అంటే 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో SBI తన కస్టమర్లకు అత్యవసరమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని హెచ్చరిక జారీ చేసింది. సమ్మె కాలంలో బ్యాంక్ బ్రాంచీలు అందుబాటులో ఉండనందున లావాదేవీలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని బ్యాంకు స్పష్టం చేసింది.
ఈ సమ్మె సమయంలో ఖాతాదారులకు మరింత అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26, 27 తేదీలలో వారాంతపు సెలవులు రావడం, దానికి కొనసాగింపుగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఈ సమ్మె జరగడం వల్ల.. మొత్తంగా 5 రోజుల పాటు సాధారణ బ్రాంచ్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. బ్రాంచ్‌లను వెళ్లి డాక్యుమెంట్స్ సబ్మి్ట్ చేయటం, వెరిఫికేషన్, సిబ్బంది సహాయం కోరే పనులకు ఈ రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావచ్చు.
అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని SBI తెలిపింది. బ్రాంచ్‌లు మూతపడినప్పటికీ.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అత్యవసరమైన క్యాష్ విత్ డ్రా కోసం ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్, విత్‌డ్రాయల్ మెషీన్లు.. అలాగే కస్టమర్ సర్వీస్ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, YONO యాప్, యూపీఐ వంటి డిజిటల్ ఛానెల్స్ ద్వారా డబ్బు పంపటం, సాధారణ చెల్లింపులు ఎలాంటి అంతరాయం లేకుండా చేసుకోవచ్చని సూచించింది.
►ALSO READ | కొత్త వారం దిగొచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రేట్లివే..!
ఫిజికల్ డాక్యుమెంట్లు అందించాల్సిన పనులు, కొన్ని ప్రత్యేక చెక్-సంబంధిత పనులకు డిజిటల్ ద్వారా పూర్తి చేయడం సాధ్యపడదు కాబట్టి.. అలాంటి పనులున్నవారు సమ్మె ప్రారంభమయ్యే ముందే పూర్తి చేసుకోవడం మంచిది. వీటి కోసం చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం ద్వారా అనవసరమైన అసౌకర్యాన్ని నివారించవచ్చని SBI కస్టమర్లకు స్పష్టం చేసింది.
