తిరువనంతపురం: కేరళలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహాలు, ఆకస్మిక వరదలు సంభవించడంతో కనీసం ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. సీఎం వీడి సతీశన్ ఆదేశాల మేరకు అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు.
మలప్పురం జిల్లాలో ఆకస్మిక వరదలు
మలప్పురం జిల్లాలో ఆదివారం (సెప్టెంబర్ 20) సాయంత్రం భారీ వర్షాలు కురువడంతో నిలంబూర్-అమరంబలం ప్రాంతంలో కొట్టపుళ నది పొటెత్తింది. ఆకస్మిక వరదలో ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. వాందూర్‌కు చెందిన ఒక బృందం స్నానం చేయడానికి నదిలోకి దిగగా ఆకస్మిక వరద కారణంగా కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు.
కొట్టాయంలో విరిగిపడ్డ కొండచరియలు
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ఆదివారం (సెప్టెంబర్ 20) సాయంత్రం కొట్టాయం జిల్లాలోని టీకోయ్ సమీపంలో ఉన్న వేలతుస్సేరి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని చెన్నైలోని జవహర్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల సంగీత అరుల్ లాల్‌గా గుర్తించారు. స్నేహితురాలితో కలిసి వాగమన్ నుంచి స్కూటర్ పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.
ఇడుక్కి జిల్లాలోని కొట్టకంబూర్‌లో వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక షెడ్డులో తలదాచుకున్న ముగ్గురు వ్యక్తులు కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకున్నారు. కొండపైనుంచి భారీగా మట్టి కూలి షెడ్డుపై పడటంతో ముగ్గురూ దాని కింద కూరుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, ఒక మహిళ గాయపడటంతో చికిత్స కోసం తరలించారు.
రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు
రాబోయే నాలుగు రోజుల పాటు కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) అంచనా వేసింది. సెప్టెంబర్ 20, 21 తేదీలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో, రెడ్ అలర్టులు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇండ్లలోనే ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.
