హైదరాబాద్: ఎల్‌నినో సృష్టించే తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రానున్న సీజన్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తి దారుణంగా పడిపోనుందని, ఇది రాష్ట్రంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని అనియంత్రిత స్థాయికి తీసుకెళ్తుందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ‘‘నీటి నిల్వలు లేకపోవడంతో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది.
దీని ప్రభావంతో రైతు బజార్లు, బహిరంగ మార్కెట్లకు నిత్యం వచ్చే సరఫరా నిలిచిపోయి టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి, అల్లంలాంటి ప్రాథమిక నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాన్స్‌లర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదికల ప్రకారం జాతీయ సగటు కంటే తెలంగాణలోనే రిటైల్ ద్రవ్యోల్బణం 6.27శాతం అత్యధికంగా నమోదవుతున్నది. ఈ ఎల్‌నినో నష్టం తోడైతే మార్కెట్లో కూరగాయల ధరలు మరింత మండిపోతాయి” అని స్పష్టం చేశారు.
మరోవైపు వర్షాభావం, జలాశయాల్లో నీరు అట్టడుగుకు చేరడం వల్ల ఆహార ధాన్యాలు, పప్పుదినుసుల దిగుబడులు ఏకంగా 30 నుంచి 40 శాతం మేర పడిపోవచ్చని వ్యవసాయ నిపుణులు లెక్కగట్టారు. ముఖ్యంగా కందిపప్పు, మినపపప్పు, పెసర్లు, సన్న బియ్యం ఉత్పత్తి తగ్గిపోవడంతో బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను దాటిపోనున్నట్టు అంచనా వేశారు.
అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి, పశుగ్రాసం (పచ్చిగడ్డి) దొరక్కపోవడం, వేసవిని మించిన ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల పాడి పశువుల్లో పాల ఉత్పత్తి దాదాపు 20 నుంచి 25 శాతం వరకు తగ్గిపోయే ముప్పు పొంచి ఉందని తేల్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పాల కొరత ఏర్పడి, లీటరు పాల ధరపై అదనంగా రూ.5 ఆపైన భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
సుదీర్ఘంగా ఎల్‌నినో ఎఫెక్ట్
ఎల్‌నినో ఎఫెక్ట్ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తుండటంతో పల్లెల్లో ఉపాధి సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. పొలాలు బీడువారడం, చెరువులు ఎండిపోవడంతో వ్యవసాయ పనులు దొరకని దయనీయ పరిస్థితులు ఎదురుకానున్నాయని పేర్కొన్నది.
►ALSO READ | హైదరాబాద్ సిటీకి ఎల్ నినో గండం.. మంచి నీటి కష్టాలు తప్పవు
దీంతో మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది కుటుంబాలు జీవనోపాధి కోసం హైదరాబాద్‌లాంటి నగరాలకు వలస బాట పట్టక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. వలసల నివారణకు ఉపాధి పనులను పెంచేలా సర్కార్ సిద్ధమైంది. పని దినాలు పెంచాలని కేంద్రానికి లేఖ రాసింది.
ఎల్‌నినో వల్ల వర్షాభావం ఏర్పడి పంటలు ఎండిపోతే, గ్రామీణ ప్రజల చేతుల్లో డబ్బు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. చేతిలో డబ్బు లేకపోవడంతో గ్రామీణ కొనుగోలు శక్తి కుప్పకూలుతుంది. దీని ప్రభావంతో రైతులు కొత్తగా ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు కొనడం ఆపేస్తారు. పల్లెల్లో బైకులు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు.. చివరికి కన్స్యూమర్ గూడ్స్ అమ్మకాలు సైతం 30 నుంచి 40 శాతం పడిపోయే ప్రమాదం ఉంది.
