రెజినగర్ బై పోల్‎లో గెలుపు నాదే: రబీయుల్ ఆలం చౌధురి ధీమా

రెజినగర్ బై పోల్‎లో గెలుపు నాదే: రబీయుల్ ఆలం చౌధురి ధీమా

కోల్‌‌‌‌కతా: రెజినగర్ ఉపఎన్నికలో పోటీపై తలెత్తిన అయోమయం, నాటకీయ పరిణామాల అనంతరం.. టీఎంసీలోని మమతా బెనర్జీ వర్గం అభ్యర్థి రబీయుల్ ఆలం చౌధురి విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 6న జరగనున్న ఈ ఎన్నికల్లో పార్టీకి కేటాయించిన కొత్త గుర్తును ఓటర్లకు పరిచయం చేసేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. 

టీఎంసీలో ఏర్పడిన వర్గపోరు కారణంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో పాటు ‘ఫుట్‌‌‌‌బాల్ ప్లేయర్’ ఎన్నికల గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో బెంగాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న చౌధురి.. మమత నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ‘దీదీనే మా నాయకురాలు. ఆమె ఆదేశాల మేరకే ఈ ఉపఎన్నికల బరిలో నిలుచున్నా. ఫుట్‌‌‌‌బాల్ ప్లేయర్ గుర్తుతో విజయం సాధిస్తామని మా కార్యకర్తలు నమ్ముతున్నారు’ అని అన్నారు. సోమవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.