రాను రానూ కల్తీ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పాలు మొదలుకొని నుంచి అల్లం పేస్ట్, టూత్ పేస్ట్ వరకు దేన్నీ వదలకుండా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ అంబర్ పేటలో కల్తీ పెరుగు తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
మార్చి 13న అంబర్ పేట్ పరిధిలోని రహత్ నగర్ దగ్గర NR ఎంటర్ప్రైజెస్ పేరుతో నడుస్తున్న కర్డ్ (పెరుగు) తయారీ యూనిట్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు. సరైన రికార్డులు లేకుండా, అనారోగ్యకర పరిస్థితుల్లో పెరుగు తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. తయారు చేసిన పెరుగులో ఈగలు ఉన్నట్లు గుర్తించారు. కాస్టిక్ సోడా, అసిటిక్ అన్హైడ్రైడ్ వంటి రసాయనాలు పెరుగు తయారీలో వాడుతున్నట్లు తేల్చారు అధికారులు.
యూనిట్ నిర్వహిస్తున్న నరేష్, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత ఆరు నెలలుగా కల్తీ పెరుగును శుద్ధమైనదిగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. 2500 కిలోల పెరుగు, సుమారు 15 కిలోల కాస్టిక్ సోడా , 20 లీటర్ల అసిటిక్ అన్హైడ్రైడ్ , 150 గ్రాముల CHR Hansen , 150 గ్రాముల Danisco (థర్మోఫిలిక్ కల్చర్స్) ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ శాఖతో కలిసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
