ప్రభుత్వ టీచర్‌ను వేధించిన పోలీస్: కానిస్టేబుల్‌పై FIR నమోదుకు కోర్టు ఆదేశం

ప్రభుత్వ టీచర్‌ను వేధించిన పోలీస్: కానిస్టేబుల్‌పై FIR నమోదుకు కోర్టు ఆదేశం

 హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్  ఎం.డి. యాకుబ్ పై కేసు నమోదయ్యింది.  కానిస్టేబుల్ తీవ్రంగా దూషిస్తూ, మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మహమ్మద్ స్టాలిన్ బేగ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు  ఆరోపించారు.

స్థానిక పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరగకపోవడంతో, బాధితుడు చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు జరుగుతున్న అన్యాయంపై కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ప్రథమ శ్రేణి న్యాయ మెజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్), కానిస్టేబుల్‌పై చర్యలకు ఆదేశించారు.

ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం... బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 175 ప్రకారం ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముల్కనూర్ ఎస్ హెచ్ వో (SHO)ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ముల్కనూర్ పోలీసులు కానిస్టేబుల్ యాకుబ్‌పై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ అధికారిపైనే కోర్టు ఆదేశాలతో కేసు నమోదు కావడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.