జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఇల్లంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం వాస్తు శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన నియమాలను చెప్పారు. మన ఇంట్లో చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే.. మరికొన్ని తప్పుల వల్ల ఆ తల్లికి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట. అందులోనూ ముఖ్యంగా ఇల్లు ఊడ్చే 'చీపురు' విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సూర్యాస్తమయం (సాయంత్రం చీకటి పడే సమయం) అయ్యాక ఇల్లు ఊడవడం మహా పాపమని పెద్దలు చెబుతుంటారు. అసలు సాయంత్రం పూట ఇల్లు ఎందుకు ఊడ్చకూడదు ? చీపురును ఇంట్లో ఎలా ఉంచాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...
చీపురును లక్ష్మీదేవితో ఎందుకు పోలుస్తారు?
హిందూ సంప్రదాయంలో చీపురును కేవలం చెత్త ఊడ్చే వస్తువుగా చూడరు. దానిని సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే చీపురును కాళ్లతో తన్నడం గానీ, దానికి అగౌరవం కలిగించడం గానీ చేస్తే జీవితంలో కష్టాలు మొదలవుతాయని నమ్ముతారు. చీపురును సరిగ్గా చూసుకోని ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు.
సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడిస్తే ఏమవుతుంది?
చాలామంది ఆఫీసుల నుంచి సాయంత్రం రాగానే లేదా రాత్రి పూట ఇల్లు దుమ్ముగా ఉందని ఊడుస్తుంటారు. కానీ వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవడం అస్సలు మంచిది కాదు. సాయంత్రం వేళ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం అని చెబుతారు. ఆ టైమ్‌లో ఇల్లు ఊడ్చడం వల్ల ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ (సానుకూల శక్తి) బయటకు పోయి, నెగటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం తాండవిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
►ALSO READ | జ్యోతిష్యం : ధనిష్ఠ నక్షత్రంలోకి రాహువు : ఈ రాశుల వారికి కొత్త ఆదాయ మార్గాలు..
చీపురు పెట్టడానికి కొన్ని వాస్తు నియమాలు:
చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
*ఇంట్లో చీపురును ఎప్పుడూ దక్షిణం లేదా పడమర దిశల్లోనే ఉంచాలి.
*పొరపాటున కూడా చీపురును ఈశాన్య మూలలో (దేవుడి మూల) లేదా వంటగదిలో పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లోకి వచ్చే డబ్బు ఆగిపోవడమే కాకుండా, అనవసర ఖర్చులు పెరుగుతాయి.
*చీపురును ఎప్పుడూ నిటారుగా నిలబెట్టకూడదు. దాన్ని ఎల్లప్పుడూ నేలపై పడుకోబెట్టినట్లుగానే ఉంచాలి. చీపురును నిలబెట్టడం అశుభానికి సంకేతం.
చీపురును ఎక్కడ పెట్టాలి
మనం ఇంట్లో డబ్బును, నగలను బీరువాలో ఎలా దాచుకుంటామో.. లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా అలాగే దాచాలి. ఇంటికి వచ్చే బయటి వ్యక్తుల కళ్లలో చీపురు నేరుగా పడకూడదు. ఎవరికీ కనిపించని విధంగా, ఒక ప్రదేశంలో చీపురును కనిపించకుండా ఉంచడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి, ఇకపై మీ ఇంట్లో చీపురు విషయంలో ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
