బ్రిటన్: ఇంగ్లాండ్ క్రికెట్ హిస్టరీలో మరో గొప్ప అధ్యాయం ముగిసింది. ఆ జట్టు టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తనకు చివరిదని ప్రకటించాడు.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ధృవీకరించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు స్టోక్స్ గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నైట్ క్లబ్లో వివాదం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన స్టోక్స్ మూడో టెస్ట్‌కు జట్టులోకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.
ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా పేరు సంపాదించిన స్టోక్స్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా టెస్ట్ క్రికెట్‌కు కూడా గుడ్ బై చెప్పడంతో గ్రౌండ్లో అతడి ప్రయాణం ముగిసింది. స్టోక్స్ సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు.
స్టోక్స్ కెరీర్ అండ్ హైలెట్స్
తన 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో (2011–2026) స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున 121 టెస్టుల్లో 7228 పరుగులు, 246 వికెట్లు సాధించారు. 114 వన్డేల్లో 3,463 రన్స్, 74 వికెట్లు తీశాడు. 43 టీ20ల్లో 585 రన్స్, 26 వికెట్లు పడగొట్టాడు. 2011లో వైట్ బాల్ క్రికెట్‌తో ప్రస్థానం ప్రారంభించిన స్టోక్స్.. 2013/14లో ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఏప్రిల్ 2022 నుంచి ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
స్టోక్స్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఇంగ్లాండ్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. 2019 ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 84 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లాండ్‌కు తొలి వన్డే వరల్డ్ కప్ అందించాడు. హెడింగ్లీ వేదికగా జరిగిన యాషెస్ టెస్టులో (135) వీరోచిత సెంచరీతో అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు. ఇంగ్లాండ్ 2022 టీ20 ప్రపంచకప్ గెలవడంలో కూడా స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు.
