ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడం, విచారణలు సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరిగినప్పుడు దొరికే డైరీలు, కంప్యూటర్ ఎక్సెల్ షీట్ల ఆధారంగా ప్రాపర్టీలు కొన్నోళ్లకు ఐటీ శాఖ నోటీసులు పంపుతోంది. బిల్డర్ దగ్గర దొరికిన రికార్డులను బట్టి మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే అదనంగా బ్లాక్ మనీ చెల్లించారు, దీనికి పన్ను కట్టండి అంటూ డిమాండ్ చేస్తోంది. అయితే కేవలం ఒక బిల్డర్ దగ్గర దొరికిన ఎక్సెల్ షీట్ ఆధారంగా పన్ను చెల్లింపుదారులపై అదనపు పన్ను భారం మోపవచ్చా అనే ప్రశ్నకు ముంబై ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ తాజాగా 'ఖచ్చితంగా కుదరదు' అంటూ పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే కీలక తీర్పునిచ్చింది.
ఈ స్టోరీ అంబర్‌నాథ్‌కు చెందిన సంజీత్‌కుమార్ కేదార్‌నాథ్ గుప్తా అనే వ్యక్తికి సంబంధించినది. ఆయన తన సోదరుడితో కలిసి 'జీఎన్‌పీ గెలాక్సీ ఫేజ్-1' లో రూ.50 లక్షల రిజిస్టర్డ్ అగ్రిమెంట్‌తో ఒక కమర్షియల్ షాప్ కొనుగోలు చేశారు. ఇందులో సంజీత్ తన వాటా రూ.22.5 లక్షలను బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారా సక్రమంగా చెల్లించారు. అయితే 2021 సెప్టెంబర్‌లో ఐటీ శాఖ సదరు బిల్డర్ సంస్థపై సోదాలు నిర్వహించినప్పుడు.. వారి ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో ఒక ఎక్సెల్ షీట్ దొరికింది. అందులో ఈ సోదరులు బిల్డర్‌కు అదనంగా రూ.90 లక్షలు ఒక ఆర్థిక సంవత్సరంలో, మరో రూ.25 లక్షలు ఇంకొక ఆర్థిక సంవత్సరంలో క్యాష్ రూపంలో చెల్లించినట్లు రాసి ఉంది. దీని ఆధారంగా ఐటీ శాఖ సంజీత్ ఆదాయాన్ని రీఅసెస్మెంట్ చేసి దాన్ని అదనపు ఆదాయంగా పరిగణిస్తూ నోటీసులు ఇచ్చి పన్ను విధించింది.
సంజీత్ ఈ అదనపు నగదు చెల్లింపులను పూర్తిగా తిరస్కరించారు. తాను కేవలం సేల్ డీడ్‌లో ఉన్న మొత్తాన్ని మాత్రమే కట్టానని.. బిల్డర్ రాసుకున్న రికార్డులతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐటీ కమీషనర్ ఈ అదనపు పన్నును సమర్థించినప్పటికీ, సంజీత్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. కేసును పరిశీలించిన ముంబై ఐటీఏటీ బెంచ్.. ఐటీ శాఖ చర్యను తప్పుబట్టింది. ఒకరి ఆఫీసులో దొరికిన ఎక్సెల్ షీట్ లేదా లూజ్ పేపర్లు కేవలం "మూగ పత్రాలు" మాత్రమేనని పేర్కొంది. కేవలం వాటి ఆధారంగానే పన్ను విధించలేమని, పన్ను చెల్లింపుదారుడు నిజంగానే డబ్బు ఇచ్చాడనడానికి ఐటీ శాఖ బలమైన ఆధారాలను చూపించలేకపోయిందని స్పష్టం చేస్తూ రూ.25 లక్షల అదనపు పన్ను డిమాండ్‌ను పూర్తిగా కొట్టేసింది.
ఈ తీర్పు ద్వారా పన్ను చెల్లింపుదారుల హక్కులను ట్రిబ్యునల్ మరోసారి గుర్తుచేసింది. లెక్కల్లో చూపని ఆదాయం ఉందని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ఐటీ శాఖదేనని స్పష్టం చేసింది. సోదాల్లో ఎలాంటి నగదు సీజ్ కానప్పుడు, నగదు విత్‌డ్రా చేసినట్లు బ్యాంక్ రికార్డులు లేనప్పుడు, కనీసం స్వతంత్ర సాక్ష్యాలు లేనప్పుడు కేవలం థర్డ్ పార్టీ రాసుకున్న రికార్డుల ఆధారంగా నోటీసులు ఇవ్వడం చెల్లదని తేల్చింది. అంతేకాదు బిల్డర్ ఉద్యోగుల స్టేట్‌మెంట్లను వాడుకున్నప్పుడు, వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కును ట్యాక్స్ పేయర్‌కు నిరాకరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. భవిష్యత్తులో ఐటీ నోటీసులు ఎదుర్కొనే సామాన్య పన్ను చెల్లింపుదారులకు ఈ చట్టపరమైన రక్షణలు కొండంత అండగా నిలుస్తాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
