కంటెంట్ ఉంటే చాలు నటీనటులతో సంబంధం లేదు. భాషా సరిహద్దులను చెరిపేసి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. ఇప్పుడు ఈ జాబితాలో కన్నడ చిత్రం చేరింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'సీతారామ్ సెకండ్ కేస్' థియేటర్లలోనే కాకుండా, డిజిటల్ స్పేస్‌లోనూ బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ప్రైమ్ వీడియో (Prime Video)లో ఈ సినిమా ఏకంగా 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. అంతేకాకుండా, భారతదేశంలో వరుసగా 15 వారాల పాటు టాప్-10 కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్..
2026 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ 17 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వర్సటైల్ యాక్టర్ విజయ్ రాఘవేంద్ర తన నటనతో సినిమాను ముందుండి నడిపించగా, గోపాలకృష్ణ దేశ్‌పాండే, సాగర్ పురాణిక్ కీలక పాత్రల్లో జీవించేశారు. అనవసరమైన ఆర్భాటాలు, కమర్షియల్ హంగులకు పోకుండా.. కేవలం క్రైమ్, సస్పెన్స్, ఎమోషన్ల ఆధారంగా దర్శకుడు దేవి ప్రసాద్ శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరును ప్రశంసలు అందుకుంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను చివరి వరకు సీటు అంచున కూర్చోబెడుతుంది.
ఓటీటీ చార్ట్స్‌లో టాప్..
ప్రముఖ దర్శకుడు పవన్ వడేయార్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పించగా, దేవి ప్రసాద్ శెట్టి, సాత్విక్ హెబ్బార్ సంయుక్తంగా నిర్మించారు. మొదట కన్నడలో విడుదలైన ఈ చిత్రాన్ని, ప్రేక్షకుల నుంచి వచ్చిన విపరీతమైన డిమాండ్ కారణంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన పబ్లిసిటీయే ఈ సినిమాను నెలల తరబడి ఓటీటీ చార్ట్స్‌లో టాప్‌లో ఉంచేలా చేసింది.
మొత్తానికి 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్' మరోసారి ఒక విషయాన్ని నిరూపిస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకపోయినా.. బలమైన కథ, నమ్మకమైన నటన, పకడ్బందీ స్క్రీన్‌ప్లే ఉంటే ప్రాంతీయ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోగలదు. కన్నడ సినిమాకు ఈ ఓటీటీ విజయం మరో బూస్ట్ ఇవ్వడమే కాదు.. కథకు భాషా సరిహద్దులు లేవని మరోసారి చాటిచెప్పింది.
