- ధర తగ్గుతున్నా కొనేందుకు పబ్లిక్ వెనుకడుగు
- నాలుగు నెలల్లో రూ. 1.70 లక్షలు తగ్గిన వెండి ధర
- రూ. 30 వేలు తగ్గిన బంగారం ధర
- గతంలో నెలకు వంద టన్నుల దిగుమతులు.. ఇప్పుడు 30 టన్నులే
- ఇంకా తగ్గొచ్చని జనం ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా బంగారం, వెండి కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. రికార్డ్ స్థాయిలో పెరిగిన ధరలు తగ్గుముఖం పడుతున్నా.. జనం మాత్రం కొనుగోళ్లకు ఇంకా వెనకడుగు వేస్తున్నారు. దీంతో బంగారం, వెండి అమ్మకాలతోపాటు దిగుమతులు కూడా భారీగా పడిపోయాయి. దేశంలో గత కొన్ని నెలలుగా బంగారం, వెండి మార్కెట్లలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ముందు ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది మార్చిలో 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ హై రూ.1,69,000కు చేరింది. ప్రస్తుతం రూ. 1,45,000 ధర పలుకుతోంది. గత 4 నెలల్లో ఏకంగా రూ. 30 వేలు తగ్గింది. ఇక వెండి ధర విషయానికొస్తే మార్చిలో కేజీ వెండి ధర కేజీ రూ. 4,10,000 ఉండగా ప్రస్తుతం రూ. 2,40,000కు తగ్గింది. ధరలు తగ్గినప్పటికీ, సాధారణంగా భారతీయులకు ఉండే 'బంగారం మోజు' మాత్రం ఈసారి మార్కెట్‌లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు, దిగుమతులు భారీగా పడిపోయాయి. గతంలో దేశంలోకి నెలకు 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారం దిగుమతి అయ్యేది. ప్రస్తుతం అది కేవలం 25 నుంచి 30 మెట్రిక్ టన్నులకు పరిమితమైంది. జ్యువెలరీ షాపుల్లో వ్యాపారాలు 70 శాతం నుంచి 80 శాతం వరకు పడిపోయాయని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారం చేస్తున్న గోల్డ్ స్మిత్‌లు అయితే భారీ షోరూమ్‌లు ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్ల ధాటికి పోటీ పడలేకపొతున్నారు. పెద్ద షోరూమ్‌లు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తామన్నా కొనుగోలుదారులు రావడం లేదు. అతిగా అవసరమైతే తప్ప(పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు) పాత బంగారాన్ని మార్పిడి (ఎక్సేంజ్) చేసుకుంటున్నారే తప్ప కొత్త బంగారం కొనడానికి ఆసక్తి చూపడం లేదు.
హైదరాబాద్‌లోనూ భారీగా తగ్గిన సేల్స్
దేశంలోనే అత్యధిక కొనుగోలు శక్తి గల నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో కూడా బంగారం, వెండి అమ్మకాలు గత కొద్ది నెలలుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ధరలు ఆల్‌టైమ్ హై రికార్డులకు చేరడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కొనుగోళ్లు ఊహించని విధంగా తగ్గాయి. ప్రస్తుతం ధరలు కొంత మేర తగ్గుముఖం పట్టినప్పటికీ, మార్కెట్‌లో ఇంకా స్తబ్ధత కొనసాగుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్ల(ప్యాట్నీ, జనరల్ బజార్, సోమాజిగూడ, కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్ పేట, దిల్‌షుఖ్ నగర్, మెహిదీపట్నం, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి)లో పెద్ద ఎత్తున గోల్డ్ షోరూమ్‌లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో నగర వ్యాప్తంగా రోజుకు సగటున 150 నుంచి 200 కిలోల వరకు బంగారం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో అమ్ముడవుతుంటుంది. అలాగే 1.5 నుంచి 2 టన్నుల వరకు వెండి విక్రయాలు జరుగుతాయి. ధరలు విపరీతంగా పెరగడం, ఆపై మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు నెలకొనడంతో ప్రస్తుతం రోజువారీ అమ్మకాలు 35 శాతం నుంచి 40 శాతం వరకు పడిపోయాయి. సాధారణంగా పెళ్ళిళ్లు, పండగల సీజన్ (ఉగాది, బోనాలు, అక్షయ తృతీయ) ఉన్న నెలల్లో హైదరాబాద్‌లో నెలకు 4 నుంచి 5 టన్నుల బంగారం, దాదాపు 40 నుంచి 50 టన్నుల వెండి వ్యాపారం జరుగుతుంది. సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల విస్తృతితో నగరంలో కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అయినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అత్యవసరమైన పెళ్ళిళ్ల కస్టమర్లు మినహా, సాధారణ కొనుగోలుదారులు మాత్రం మార్కెట్‌కు రావడానికి సంకోచిస్తున్నారు.
దిగుమతి సుంకం పెంపు
దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వల(ఫారెక్స్ రిజర్వ్స్)లను కాపాడేందుకు, కరెంట్ ఖాతా లోటును అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతం శాతానికి పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయంతో మధ్యతరగతి ప్రజలు పొదుపు బాట పట్టారు. ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోతుండటంతో బంగారం, వెండిపై పెట్టుబడులు తగ్గించారు. అంతర్జాతీయంగా ధరలు దిగిరావడంతో రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా తగ్గుతుందనే నమ్మకంతో చాలా మంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. గత రెండేళ్లుగా టన్నుల కొద్దీ బంగారం కొన్న ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు(భారత్, చైనా, రష్యాతో సహా) ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో కొనుగోళ్లను 22 శాతం తగ్గించాయి. యుద్ధ వనరుల కోసం రష్యా సెంట్రల్ బ్యాంక్ దాదాపు 30 టన్నుల భౌతిక బంగారాన్ని అమ్మేసింది.
డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు
గతంలో బంగారం కొని లాకర్లలో దాచుకునే వాళ్లు. వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే యువత, ఇన్వెస్టర్లు ఇప్పుడు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు మళ్లుతున్నారు. ఫోన్‌పే, పేటీఎం వంటి ఫిన్‌టెక్ యాప్‌ల ద్వారా కేవలం రూపాయి నుంచి కూడా బంగారం కొనే సదుపాయం ఉండటంతో 20 నుంచి 35 ఏళ్ల వయసు గల యువత డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం గత ఏడాది డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు 69 శాతం పెరిగి 13.5 టన్నులకు చేరాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1.45 లక్షల వద్ద ఉంది. రాబోయే 6 నెలల్లో మార్కెట్‌లో ఈ ధర తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ధర రూ. 1.33 లక్షలకు లేదా అత్యంత అనుకూల పరిస్థితుల్లో రూ. 1.26 లక్షల వరకు దిగిరావచ్చని అంటున్నారు.
ఇంకా తగ్గుతుందనే కొనటం లేదు
బంగారం కొనాలని ఆలోచన గతంతో పోలిస్తే ఇపుడు పబ్లిక్‌లో తగ్గింది. పబ్లిక్ దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. మనీ ఫ్లో గతంలో కంటే తగ్గింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నా కొనేందుకు వెనుకాడుతున్నారు. ఇందుకు ధర భారీగా పెరగటమే కారణం. కరోనా టైమ్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.50 వేలు ఉండేది. నాలుగేళ్లలో ఈ ధర లక్షన్నరకు చేరుకుంది. రూ. 80 వేలు, రూ. లక్ష ఉన్నపుడు తగ్గుతుందేమోనని కొనలేదు. ఆ ధర లక్షన్నరకు చేరుకుంది. గత 3 నెలల నుంచి ధర తగ్గుతోంది. అయినా కొనేందుకు వెనుకాడుతున్నరు. కొత్తగా కొనకుండా పాత బంగారాన్ని ఎక్స్ చేంజ్ చేసి కొంత మనీ కట్టి కొత్త నగలు చేపించటం, కొనటం చేస్తున్నారు.
- ప్రమీల, హౌస్ వైఫ్, ఖమ్మంషోరూమ్‌లతో పోటీ తట్టుకోలేకపోతున్నం
గతంలో బంగారం అంటే షాపులకు వెళ్లి నచ్చిన డిజైన్ చూసి, చేపించుకునే వాళ్లు. ఇపుడు ప్రతి మెయిన్ ఏరియా, గల్లీల్లో బంగారం షాపులు వెలుస్తున్నాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనటం లేదు. ఒకే ఏడాది రూ. 80 వేల నుంచి లక్షన్నర వరకు పెరిగింది. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, తమిళనాడు, మహారాష్ర్టకు చెందిన జ్యువెలరీ ఓనర్లు అన్ని మెట్రో సిటీల్లో పదుల సంఖ్యలో బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని డిజైన్లు రెడీమేడ్ గా దొరుకుతున్నాయి. దీంతో గోల్డ్ స్మిత్‌లు, చిన్న షాపుల పరిస్థితి దారుణంగా ఉంది. వీటితో పాటు డిజిటల్‌గా ఆన్ లైన్‌లో గోల్డ్ స్కీమ్‌లకు ప్రతి నెలా కొంత మొత్తంలో పెట్టుబడి పెడుతూ ఏడాది, ఏడాదిన్నర కాగానే జమ చేసిన నగదును బంగారం రూపంలో తీసుకుంటున్నారు.
- ప్రదీప్, శ్రీరామ్ శ్రీ పరమేశ్వరీ జ్యువెలరీ వర్క్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్
పండగల సీజన్‌లో సేల్స్ పెరగొచ్చు
రికార్డు స్థాయిల నుంచి సుమారు రూ. 30 వేలు తగ్గినప్పటికీ, సాధారణ వినియోగదారుడికి ఇంకా భారంగానే ఉన్నాయి. రూ. లక్షా 45 వేల ధర పెట్టి కొనుగోలు చేయాలంటే వెనకడుగు వేస్తున్నారు. అయితే, ఆషాఢ మాసం ముగిసి, శ్రావణ మాసం నోములు, రాబోయే పండగల సీజన్ ప్రారంభమైతేనే మార్కెట్ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకునే అవకాశం ఉంది.
- రాజు, గోల్డ్ వ్యాపారి,
జనరల్ బజార్, సికింద్రాబాద్
