హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మార్కెటింగ్ మాయాజాలం. కలర్ ఫుల్ బాక్సులు, లేబుల్స్, పేర్లతో కస్టమర్లను ఆకర్శిస్తున్నారు. అద్భుతంగా ప్యాకింగ్ చేసి ఎంతో ఫ్రెష్ ఐటెమ్స్ లాగ భ్రమ కల్పించి అమ్ముతున్నారు. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ ను అమ్మే విధానం చూసి ఫుడ్ సెక్యూరిటీ అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. శుక్రవారం (మార్చి 13) హైదరాబాద్ సిటీ సి.సి.ఎస్ (CCS) స్పెషల్ క్రైమ్ టీమ్, ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదూర్‌పురా పోలీసుల సంయుక్త దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఓల్డ్ సిటీలో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పాడైపోయిన, అపరిశుభ్రమైన డ్రై ఫ్రూట్స్‌ను నాణ్యమైనవిగా నమ్మించి ప్రజలకు విక్రయిస్తున్న అసవా మనీష్ (42) ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు చార్మినార్, చేలాపురా ప్రాంతంలో GEM Foods (జెమ్ ఫుడ్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్)పేరుతో ఒక గోడౌన్‌ను నిర్వహిస్తున్నాడు.
డ్రైఫ్రూట్స్ పాడైపోయినట్లు తెలిసినా ప్యాకింగ్ చేస్తూ అమ్ముతున్నాడు. కావాలనే బూజు పట్టిన, దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్‌ను తక్కువ ధరలో సేకరించి, తినడానికి యోగ్యమైన, నాణ్యమైన డ్రై ఫ్రూట్స్‌గా నమ్మించి మోసం చేస్తున్నాడు. భారీ పరిమాణంలో సుమారు 30 కాటన్ బాక్సుల అపరిశుభ్రమైన, పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ స్వాధీనం చేసుకున్నారు. నాణ్యతలేని ఫుడ్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
