Pawan Kalyan: ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర పెంపు ఎంతంటే?

Pawan Kalyan: ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర పెంపు ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరారు. ఈ సమయంలో పవన్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ చిత్రం బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

అయితే మార్చి 18న కాకుండా.. 19వ తేదీన బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది. తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ బెనిఫిట్ షో ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఇక టికెట్ ధరను పన్నులతో కలిపి రూ. 500 గా నిర్ణయించింది. ఈ టికెట్ రేట్లను పది రోజుల పాటు పెంచుకునేందుకు వెసులబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.  మల్టీ ప్లెక్స్ లలో రూ. 125 ,  సింగ్ స్క్రీన్ లలో రూ. 100 , చొప్పున పెంచుకునేలా అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

ప్రీమియర్ షో లేనట్లేనా?

ఈ పెంచిన ధరలు మార్చి 19 నుంచి మార్చి 28 తేదీ వరకూ అమలులో ఉంటాయి ఉత్తర్వులలో వెల్లడించింది. గత కొంతకాలంగా ఆగ్ర హీరోలు నటించిన భారీ చిత్రాలకు స్పెషల్ ప్రీమియర్ షో పేరుతో సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి ప్రదర్శనకు అనుమతి ఇచ్చేవారు.  'ఉస్తాద్' సినిమాకు మార్చి 19న తెల్లవారుజామున బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ సారీ దానిపై ఇంకా స్పష్టత లేదు. 

సుప్రీం కోర్టులో టాలీవుడ్ కు ఊరట..

అటు టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  సినిమా టికెట్ ధర పెంపు వివాదంలో ఇటీవల తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంత ఉత్తర్వులపై  స్టే విధిస్తూ ఈ రోజు ( మార్చి 13, 2026 )  సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.  సినిమా విడుదల కావడానికి 90 రోజుల ముందే ధరల పెంపుపై ప్రభుత్వం మెమో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.  ఈ నిబంధన వల్ల మేకర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. 90 రోజుల నిబంధన ఆచరణాత్మకంగా ఇబ్బందులతో కూడుకున్నదని భావిస్తూ, ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే కొనసాగవచ్చని స్పష్టం చేసింది. అంటే విడుదలకు కొద్దిరోజుల ముందు అనుమతి తీసుకునే విధానానికి అనుమతి ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో టాలీవుడ్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  సుప్రీం కోర్టు తీర్పుతో భారీ వ్యయంతో నిర్మించిన చిత్రాల టికెట్ల ధరల పెంపునకు మార్గం సుగమం అయింది.