తండ్రి ఆస్తులన్నీ కొడుకువి కావు.. హైకోర్టు సంచలన తీర్పు

తండ్రి ఆస్తులన్నీ కొడుకువి కావు.. హైకోర్టు సంచలన తీర్పు

తండ్రి ఆస్తులన్నీ కొడుకులకు వారసత్వంగా సంక్రమిస్తాయా..? అంటే అవుననే అంటుంటారు అందరు. ఈ విషయంలో పూర్తిగా అవగాహన లేనప్పటికీ  వారసులం మేమే అంటుంటారు చాలా మంది. అయితే తండ్రి ఆస్తులన్నీ కొడుకుకు చెందుతాయా? అనే విషయంలో కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ కుటుంబంలో పుట్టిన వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు, అదే విధంగా తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తుల విషయంలో కొడుకుకు చెందుతాయా లేదా అంశంపై శుక్రవారం (మార్చి 13) స్పష్టమైన తీర్పు వెలువరించింది.

తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తి కొడుకుకు ఆటోమేటిక్ గా సంక్రమించదని కోర్టు చెప్పింది. అది తన జన్మహక్కుగా పరిగణించలేమని పేర్కొంది. సొంతంగా సంపాదించిన ఆస్తిని ఆ వ్యక్తి కొడుకుకు ఇవ్వకుండా అమ్ముకోవచ్చు లేదా ఇవ్వకుండా నిరాకరించవచ్చునని పేర్కొంది కోర్టు.

సింపుల్ గా చెప్పాలంటే.. తాతల నుంచి తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిపైన మాత్రమే కొడుకుకు జన్మహక్కు ఉంటుంది. అదే సమయంలో తండ్రి కష్టార్జితంగా సంపాదిచిన ఆస్తిపై కొడుకుకు హక్కు ఉండదు. కొడుకుకు ఇవ్వాలా వద్దా అనేది తండ్రి నిర్ణయంపై ఆధారపడి ఉటుంది. 

కేరళలో ఆస్థిహక్కుపై ఒక వ్యక్తి వేసిన కేసును పరిశీలించిన హైకోర్టు తీర్పు వెలువరించింది. తన తండ్రి ఆస్తిని తనకు చెందకుండా తన తల్లి చేసిందని ఒక కొడుకు పిటీషన్ వేశాడు. ఆస్తిని ఐదు మంది కుటుంబ సభ్యులకు చెందేలా వీలునామా రాయటంతో కోర్టుకెక్కాడు. 

46 సెంట్ల భూమిని ఐదు మంది కుటుంబ సభ్యులకు పంచింది అతని తల్లి. అయితే ఆ ఆస్తి తన సొంత ఆస్తిగా, పూర్వీకుల ఉమ్మడి ఆస్తిగా కాకుండా సొంతంగా సంపాదించిన ఆస్తిగా పరిగణించినందున కొడుకు కేసును ఓడిపోయాడు. ఇది తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిగా వర్గీకరించినందున, ఈ భూమిని బహుమతిగా ఇవ్వాలనే ఆమె నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో ఈ భూమిని ఇతర కుటుంబ సభ్యులకు ఇచ్చే తల్లి వీలునామాను హైకోర్టు కూడా సమర్థించింది.