The Paradise: నాని 'ది ప్యారడైజ్' మ్యాడ్నెస్.. ఒక్క పాట కోసం 2.5 ఎకరాల్లో మురికి సామ్రాజ్యం!

The Paradise: నాని 'ది ప్యారడైజ్' మ్యాడ్నెస్.. ఒక్క పాట కోసం 2.5 ఎకరాల్లో మురికి సామ్రాజ్యం!

నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. 'దసరా' వంటి మాస్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' (Aaya Sher) సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.   ఈ సాంగ్ కోసం  ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సృష్టించిన విజువల్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

నిజమైన ఇళ్లతో ‘స్లమ్ ఎంపైర్’

హీరోను మురికివాడకు రాజుగా చూపించే క్రమంలో, దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ స్లమ్ సెట్‌ను నిర్మించారు. సాధారణంగా సినిమాల్లో ఇళ్ల కోసం డమ్మీ బోర్డులు వాడుతుంటారు, కానీ సహజత్వం కోసం మేకర్స్ ఏకంగా 60 అసలైన ఇళ్లను నిర్మించడం విశేషం. 50 మంది పనివారు రాత్రింబవళ్లు 30 రోజుల పాటు కష్టపడి ఈ విలేజ్ సెట్‌ను రూపొందించారు. ఇందులో సుమారు 500 మంది జనం పట్టేలా ప్లాన్ చేశారు. 

60 అడుగుల ‘కమాన్ సెట్’.. 

ఈ పాటలో ప్రధాన ఆకర్షణ హీరో ఇల్లు (కమాన్ సెట్). దీనిని 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఈ సెట్ కోసం ప్రత్యేకంగా 120 అడుగుల పొడవున్న ఒక డంప్ యార్డ్ సెట్‌ను కూడా వేశారు. ఇక ఇక్కడ నీటి కొలను సృష్టించడానికి ఏకంగా 100 ట్యాంకర్ల నీటిని వినియోగించారట. అది నిండటానికే ఏడు రోజుల సమయం పట్టిందంటే ఆ సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి పాత కాలపు లుక్ రావడం కోసం 'ఏజింగ్ టెక్నిక్స్' వాడి సహజమైన రంగులను ఉపయోగించారు.

బిర్యానీ బౌల్ వెనుక కష్టం

పాటలో కనిపించే భారీ బిర్యానీ బౌల్ ఆకారాన్ని రూపొందించడానికి ఏడుగురు సభ్యులు ఐదు రోజుల పాటు కష్టపడ్డారు. దీనికి రాగి మెరుపు ఇవ్వడం ద్వారా పాతకాలపు అనుభూతిని తీసుకొచ్చారు . శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో  సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తుండగా.. నటి సోనాలి కులకర్ణి, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జూయెల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 

ఎంతో వైవిధ్యంగా తెరకెక్కుతున్న ఈ 'ప్యారడైజ్' ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.  ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రిలీజ్ కానుంది..  ఒక్క పాట కోసమే ఇంతటి ఖర్చు, కష్టం చూస్తుంటే.. వెండితెరపై నాని 'ది ప్యారడైజ్' ఏ స్థాయి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందో అని అభిమానులు వేచి చూస్తున్నారు.