అప్పు చేసి ఎంజాయ్ చెయ్.. కట్టే సంగతి తర్వాత చూద్దాం: భారతీయుల కొత్త స్పెండింగ్ ట్రెండ్

అప్పు చేసి ఎంజాయ్ చెయ్.. కట్టే సంగతి తర్వాత చూద్దాం: భారతీయుల కొత్త స్పెండింగ్ ట్రెండ్

భారతీయ మధ్యతరగతి కుటుంబాల్లో ఒకప్పుడు పొదుపు అనేది ఒక సంస్కృతిగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి తలకిందులైంది. ఒకప్పుడు రూపాయి సంపాదిస్తే.. అర్ధ రూపాయి దాచుకునే భారతీయులు.. ఇప్పుడు సంపాదన కంటే ముందే ఖర్చు చేయడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఈ విచ్చలవిడి ఖర్చుల వెనుక ఉన్న అసలు కారణాలు.. డిజిటల్ అప్పుల ఉచ్చు దానివల్ల కలిగే రిస్కులను వివరిస్తూ సాగే నేటి తరం ఆర్థిక ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తరతరాలుగా భారతీయులకు సంపాదన, పొదుపు.. ఆ తర్వాతే ఖర్చు అనే సూత్రం వెన్నెముకగా ఉండేది. అప్పు అంటే భయం, సమాజంలో తక్కువ చేసి చూస్తారనే భావన ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ముఖ్యంగా యువతలో 'ముందు ఖర్చు చేసెయ్.. తర్వాత చూద్దాం' అనే ధోరణి పెరిగింది. 2016లో దేశ జీడీపీలో గృహ రుణాలు 31% ఉండగా, 2023 నాటికి అది 42.6%కి చేరింది. అదే సమయంలో పొదుపు మాత్రం దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళనకరం. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డుల వినియోగం గత 10 ఏళ్లలో రెట్టింపు అవ్వడమే దీనికి నిదర్శనం.

ఫిన్‌టెక్ మాయాజాలం..
ఈ మార్పు వెనుక టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో అప్పు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలి, అనేక డాక్యుమెంట్లు సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో లోన్ మంజూరవుతోంది. బై నౌ పే లేటర్, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన స్కీమ్స్ కొనుగోలుదారులను ఊరిస్తున్నాయి. అప్పు తీసుకోవడం అనేది ఒక బాధ్యతగా కాకుండా, కేవలం యూపీఐ పేమెంట్ చేసినంత సులభంగా మారిపోయింది. ముఖ్యంగా 18-30 ఏళ్ల యువత ఈ ఆకర్షణలో చిక్కుకుని, అవసరం లేకున్నా లగ్జరీల కోసం అప్పులు చేస్తున్నారు.

ఈఎంఐల వలయంలో మధ్యతరగతి..
నేడు మధ్యతరగతి భారతీయుడు 'ఎకో-నెమీ' అనే కొత్త సంక్షోభంలో ఉన్నాడు. అంటే ఆస్తుల కోసం కాకుండా, నిత్యావసరాలు, స్కూల్ ఫీజులు, మెడికల్ బిల్లుల కోసం కూడా ఈఎంఐలపై ఆధారపడుతున్నాడు. ఒక సర్వే ప్రకారం.. అప్పుల ఊబిలో ఉన్నవారిలో 85 శాతం మంది తమ నెలసరి ఆదాయంలో 40% కంటే ఎక్కువ కేవలం ఈఎంఐలకే కడుతున్నారు. జీతంలో సగానికి పైగా అప్పులకే పోతుండటంతో, ఏదైనా అనుకోని అనారోగ్యం లేదా ఉద్యోగ గండం వస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఇది కేవలం ఆర్థిక సమస్యే కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి, నిద్రలేమికి దారితీస్తోంది.

ఈ ప్రమాదకర ధోరణిని అరికట్టాలంటే కేవలం అవగాహన సరిపోదు, వ్యవస్థలో మార్పు రావాలి. అప్పు ఇచ్చే యాప్‌లు కేవలం లాభాల కోసం కాకుండా.. సదరు వ్యక్తి తిరిగి కట్టగలడా లేదా అనే అంశాన్ని ఏఐ ద్వారా కచ్చితంగా అంచనా వేయాలి. ఆదాయంలో 40% దాటి లోన్లు ఇవ్వకుండా కఠిన నియమాలు ఉండాలి. అలాగే అప్పు తీసుకున్న తర్వాత నిర్ణయం మార్చుకుంటే.. 72 గంటల్లోపు ఎటువంటి పెనాల్టీ లేకుండా ఆ డబ్బును వెనక్కి ఇచ్చే కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలి. రికవరీ ఏజెంట్ల వేధింపులు లేకుండా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ఆర్‌బీఐ బలోపేతం చేయాలి.

ఆర్థిక క్రమశిక్షణే మనిషికి నిజమైన గౌరవం. డిజిటల్ యుగంలో అప్పు సులభంగా దొరుకుతున్నప్పటికీ, అది మన భవిష్యత్తును తాకట్టు పెట్టకూడదు. అప్పును అవకాశంగా వాడుకోవాలి. కానీ.. అది మన జీవితాన్ని శాసించే స్థాయికి వెళ్లనివ్వకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉగాదితో స్టార్ట్ అయ్యే కొత్త ఏడాదిలో అయినా ప్రజలు తమ ఆర్థిక క్రమశిక్షణ, ఖర్చులపై ఫోకస్ పెట్టి అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకపోవటం మంచిదని వారు చెబుతున్నారు.