కోహెడ, వెలుగు: అదుపు తప్పి డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. హుస్నాబాద్ నుంచి మామిడి కాయల లోడుతో బయలుదేరిన డీసీఎం వ్యాన్ కరీంనగర్ మీదుగా పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తోంది.
వెంకటేశ్వరపల్లి గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వ్యాన్ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా వారిని కరీంనగర్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ బోల్తా పడటంతో అందులోని మామిడి కాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో స్థానికులు ఎగబడి బుట్టలు, సంచుల్లో కాయలు తీసుకెళ్లారు.
