మెదక్/ కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ పీఏసీఎస్ పరిధిలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వడ్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బుల పంపకాల విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈక్రమంలో సివిల్ సప్లై, పోలీస్ శాఖలు విచారణ చేపట్టాయి. కౌడిపల్లి కొనుగోలు కేంద్రంలో ఎన్ని వడ్లు కొన్నారు.. గోడౌన్‌కు ఎంత తరలించారు.. లారీలను ఏ వేబ్రిడ్జి వద్ద కాంటా వేయించారు. ట్రక్ షీట్లలో నమోదైన వడ్లు, రైతుల అకౌంట్లలో జమ అయిన డబ్బు.. తదితరల వివరాలను విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కాగా ఈ వ్యవహారంలో కౌడిపల్లికి చెందిన యూట్యూబ్ రిపోర్టర్ లింగంగౌడ్వేధింపుల వల్లే కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రోజుల కింద పోలీసులు రిపోర్టర్‌ను అరెస్ట్ చేశారు.
అవినీతి జరిగిందిలా..
రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వకు స్థలం కొరత ఉందని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని గోదాములకు తరలించారు. ఇక్కడే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సొసైటీ సిబ్బంది అవినీతి చేసినట్లు విజిలెన్స్అధికారులు గుర్తించారు.అధికారిక లెక్కల ప్రకారం మహ్మద్ నగర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో కౌడిపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 310 మంది రైతుల నుంచి 15 వేల క్వింటాళ్ల ధాన్యం కొన్నారు.
వాస్తవంగా అక్కడ అంత ధాన్యం కొనలేదు. కొన్న వడ్లను నిల్వ కోసం పాంపల్లిలోని గోడౌన్‌కు తరలించే క్రమంలో ధాన్యం లారీలను వే బ్రిడ్జిలో కాంటా పెట్టాక ట్రక్ షీట్‌లతో ఎక్కువ ఉన్నట్లు నమోదు చేసినట్లు తెలిసింది. పెద్ద లారీలో 650 బస్తాలు పట్టే సామర్థ్యం ఉండగా.. వే బ్రిడ్జిలో కాంటా పెట్టాక ట్రక్ షీట్లలో 800, 850 బస్తాలు రాసినట్టు తెలిసింది.
ఇలా ధాన్యం దాదాపు 2 వేల క్వింటాళ్ల వరకు కొనని వడ్లను ట్రక్ షీట్లలో నమోదు చేశారు. ఇలా ఎక్కువ రాసిన వడ్ల పైసలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సొసైటీ సిబ్బంది తమ అకౌంట్లలో జమచేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇలా దాదాపు రూ.50 లక్షల వడ్ల పైసలు కాజేసినట్టు తెలిసింది.
