కేసీఆర్ కు పేరొస్తదనే ..కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయట్లే

కేసీఆర్ కు పేరొస్తదనే  ..కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయట్లే
  • ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
  • సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర

సిద్దిపేట, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి మరో హిట్లర్ లా తయారయ్యాడు, కాళేశ్వరం కట్క వత్తు అంటే జైల్లో పెడతానంటూ బెదిరిస్తున్నాడు, కేసీఆర్ కు పేరు వస్తుందన్న భయంతోనే మోటార్లు ఆన్ చెయ్యడం లేదు' అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు ఆదివారం రైతులతో కలసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం కూలిందని చెబుతున్న రేవంత్ రెడ్డి.. చిన్నకోడూరుకు నీళ్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు పోతున్నాయి ఎత్తమంటే.. 16 వేల క్యూసెక్కులే పోతున్నాయని అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. లక్ష క్యూసెక్కుల నీళ్లు పోతున్నప్పుడు ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. 

మరో 15 రోజులు గడిస్తే రెండు లక్షల క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గరకు వస్తాయని, అప్పుడన్నా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోతే ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ ప్లాంట్లలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోవడమే కాకుండా హైదరాబాద్ తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చిందని ఎద్దేవా చేశారు. నీళ్లను ఎత్తి పోయకుండా కిందికి విడిచి పెడుతుండడంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పట్టిసీమ మోటర్లు ఆన్ చేసి నీళ్లను ఒడిసి పట్టుకుంటున్నారన్నారు. 

ఇప్పటివరకు 70 టీఎంసీల నీళ్లను ఏపీకి విడిచి పెట్టారని, అవే నీళ్లు ఎత్తిపోస్తే రంగనాయక సాగర్ నిండేదన్నారు. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ నింపాలని డిమాండ్ చేశారు. దుకాణాల్లో యూరియానే లేనప్పుడు యాప్ ఎందుకని ప్రశ్నించారు. 

కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉండి ఎత్తకపోతే రాబోయే పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీనే మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. మ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం కోసం వెంటనే కన్నేపల్లిలో మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్ లు నింపాలని డిమాండ్ చేశారు.