హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా పరిధిలో రేషన్ లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియపై ఇంకా లక్షలాది మంది స్పందించకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 31లోగా ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని సూచించారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేయని వారికి వచ్చే నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీలో కోత విధించాలని రేషన్ డీలర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
జంట నగరాల పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో 652 రేషన్ దుకాణాల ద్వారా 8 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి కింద మొత్తం 32 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 24.22 లక్షల మంది మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేశారు. ఇంకా 7.78 లక్షల మంది ప్రక్రియ పూర్తి చేయలేదు.
అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను తొలగించడం కోసం ఈ–కేవైసీ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక శిబిరాలు..
ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. నగరంలోని తొమ్మిది సర్కిళ్లను సెక్టార్లు, సబ్‌సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్‌కు తనిఖీ ఇన్‌స్పెక్టర్లను ఇన్‌చార్జిలుగా నియమించనున్నారు.
ప్రత్యేక శిబిరాలు నిర్వహించి లబ్ధిదారులతో ఈ–కేవైసీ పూర్తి చేయించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హతలేని లబ్ధిదారులు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. అవసరమైతే రేషన్ దుకాణాల పనివేళలను కూడా పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. ఇంకా ఈ–కేవైసీ చేయించుకోని లబ్ధిదారులు ఈ నెల 31లోగా సమీప రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
