మెదక్, పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లా పురాతన, వారసత్వ సంపదకు, ఆధ్యాత్మికతను పంచే ప్రసిద్ధ ఆలయాలకు నిలయంగా భాసిల్లుతోందని, ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా శనివారం మెదక్ జిల్లాలో పర్యటించిన ఆయన ముందుగా ఏడుపాయల వనదుర్గా భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అడిషనల్ కలెక్టర్ మెంచు నగేశ్ ఆలయ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని చారిత్రక మెదక్ ఖిల్లాను, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కెథడ్రల్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఇంతటి గొప్ప మెదక్ ఖిల్లాను తాను ఇప్పటివరకు చూడలేదని, భవిష్యత్తులో తాను నటించే, నిర్మించే సినిమాల షూటింగ్ ఇక్కడ జరుపుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
