The Odyssey Box Office : 'ది ఒడిస్సీ'తో నోలన్ సునామీ.. తొలి రోజు వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

The Odyssey Box Office : 'ది ఒడిస్సీ'తో నోలన్ సునామీ.. తొలి రోజు వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మరోసారి తన సత్తా చాటారు. సినిమా అంటే కేవలం వినోదం కాదు.. అదొక విజువల్ వండర్ అని నిరూపిస్తూ  బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ 'ది ఒడిస్సీ (The Odyssey' విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. జూలై 17న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో అదిరిపోయే ఆరంభాన్ని నమోదు చేసింది.

గ్రీక్ కావ్యం ఆధారంగా...

హోమర్ రచించిన ప్రపంచ ప్రఖ్యాత గ్రీక్ కావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  మ్యాట్ డేమన్ ఒడిస్సియస్ పాత్రలో కనిపించగా, టామ్ హాలండ్, ఆన్ హాతవే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా కీలక పాత్రల్లో మెరిశారు. ట్రోయ్ యుద్ధం ముగిసిన తర్వాత తన రాజ్యం ఇథాకాకు తిరిగి చేరేందుకు ఒడిస్సియస్ చేసిన పదేళ్ల సాహసయాత్రను అత్యంత గ్రాండ్ విజువల్స్‌తో నోలన్ తెరపై ఆవిష్కరించారు. భారీ తారాగణంతో వచ్చిన ఈ విజువల్ కావ్యానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

రికార్డులన్నీ బద్దల్.. 

అంతర్జాతీయ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం..  ప్రివ్యూలతో కలిపి తొలి రోజే ఈ సినిమా 50 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టగా, తొలి మూడు రోజుల్లో 117 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకోనుందని అంచనా మేకర్స్.. దీంతో నోలన్ కెరీర్‌లో 'ది డార్క్ నైట్ రైజెస్', 'ది డార్క్ నైట్' తర్వాత అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలవనుంది. అలాగే హీరో మ్యాట్ డేమన్ కెరీర్‌లోనూ ఇదే అతిపెద్ద ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది.

ఇండియాలోనూ మేనియా ...

భారత్‌లో కూడా ఈ సినిమాకు అద్భుత స్పందన లభించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం తొలి రోజే రూ.17.40 కోట్ల నెట్, రూ.20.76 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఇంగ్లిష్ వెర్షన్ ఒక్కటే రూ.13.75 కోట్లు రాబట్టగా, దాదాపు 77 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. హిందీ వెర్షన్ రూ.1.90 కోట్లు, తెలుగు రూ.1.10 కోట్లు, తమిళ వెర్షన్ రూ.65 లక్షలు వసూలు చేశాయి.

ALSO READ : Priyanka Chopra Varanasi: ప్రియాంక బర్త్‌డే బ్లాస్ట్.. 

ప్రత్యేకంగా IMAX 2D షోలకైతే ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభించింది. దాదాపు 74 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం నోలన్ సినిమాలపై భారత ప్రేక్షకుల క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. అద్భుతమైన విజువల్స్, హాన్స్ జిమ్మర్ స్థాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను తలపించే గ్రాండ్ ఆడియో అనుభూతి, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, భావోద్వేగాలతో కూడిన కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టిన 'ది ఒడిస్సీ' రాబోయే రోజుల్లో మరిన్ని అరుదైన మైలురాళ్లు అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..