- తప్పుడు ట్రక్ షీట్లతో లక్షలాది రూపాయలు స్వాహా
- కంప్యూటర్ ఆపరేటర్, యూట్యూబర్ మధ్య డబ్బుల గొడవతో బయటపడ్డ బాగోతం
- వేధింపులు భరించలేక సొసైటీ ఆపరేటర్ ఆత్మహత్య?
- విచారణ జరుపుతున్న సివిల్ సప్లై ఆఫీసర్లు
కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ధాన్యం కొనుగోళ్లలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా.. సొసైటీ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చేతులు కలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనకపోయినా కొన్నట్లు తప్పుడు ట్రక్ షీట్లు సృష్టించి లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. ఈ డబ్బుల పంపకాల విషయంలో తలెత్తిన గొడవ, ఆపై ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
కొనుగోలు కేంద్రాలు ఇలా..
గత యాసంగి సీజన్లో కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో సొసైటీ పరిధిలోని వివిధ గ్రామాల్లో మొత్తం 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సొసైటీ రికార్డుల ప్రకారం.. ఆయా కేంద్రాల్లో సుమారు 3,500 మంది రైతుల నుంచి 1,79,548 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా మండల కేంద్రమైన కౌడిపల్లిలోని కొనుగోలు కేంద్రంలో 310 మంది రైతుల నుంచి 15,020 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. రైస్ మిల్లుల్లో అన్‌లోడ్ సమస్యలు తలెత్తడంతో బూర్గుగడ్డ, దేవులపల్లి, తునికి, వెల్మకన్న, కౌడిపల్లి కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మండల పరిధిలోని పాపంపల్లి గోదాంలో నిల్వ చేశారు.
ఇద్దరు కలిసి ఒక ముఠాగా..
కౌడిపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని స్థానికుడైన ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ కుటుంబ సభ్యులు నిర్వహించారు. సదరు యూట్యూబ్ రిపోర్టర్, సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ధాన్యం విక్రయించని కొందరు రైతుల పేర్లపై తప్పుడు ట్రక్ షీట్లు సృష్టించి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ దందా ద్వారా సమకూరిన సొమ్మును చెరిసగం పంచుకోవాలని ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆపరేటర్ ద్వారా సదరు యూట్యూబ్ రిపోర్టర్‌కు దాదాపు రూ. 12 లక్షలు ముట్టినప్పటికీ, మొత్తం డబ్బులు తనకే కావాలంటూ రిపోర్టర్ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
వేధింపులను తట్టుకోలేక ఆపరేటర్ ఆత్మహత్య!
యూట్యూబ్ రిపోర్టర్ వేధింపులను తట్టుకోలేక ఆ సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ షేక్ హర్షద్ గత మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చర్చ నడుస్తోంది. రిపోర్టర్ వేధింపుల వల్లే హర్షద్ ప్రాణాలు తీసుకున్నాడంటూ అతని కుటుంబ సభ్యులు కూడా కౌడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో సివిల్ సప్లై అధికారులు రంగంలోకి దిగారు. కౌడిపల్లి కొనుగోలు కేంద్రంలో ఎంత మంది రైతుల నుంచి ఎంత ధాన్యం కొన్నారు, గోదాంలో ఎంత నిల్వ ఉంచారనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
పాలకవర్గం లేనప్పుడు అక్రమాలు జరిగుంటాయ్..
పీఏసీఎస్ పాలకవర్గాలు లేనప్పుడు ప్రభుత్వం సొసైటీల నిర్వహణ బాధ్యత ఉద్యోగులకే అప్పగించింది. ఆ సమయంలోనే ధాన్యం కొనుగోలులో అవకతవకలు పెద్ద ఎత్తున జరిగినట్లు అనుమానం ఉంది. మమ్మద్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో 14 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, కౌడిపల్లి కేంద్రంలో అక్రమాలు జరిగాయని తెలిసింది. సొసైటీ ఆపరేటర్ హర్షద్ ఎంత మంది రైతుల పేర్ల మీద ట్రక్ షీట్లు జారీ చేశారో.. ఆపరేటర్ కు, యూట్యూబ్ రిపోర్టర్ మధ్య జరిగిన గొడవకు కారణాలేమిటో తెలియాల్సి ఉంది. అన్ని కొనుగోలు కేంద్రాల్లో జరిగిన ధాన్యం కొనుగోళ్ల పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, దుర్వినియోగం అయిన డబ్బును రికవరీ చేయాలని సొసైటీ పాలకవర్గం తీర్మానం చేసింది.
-గోవర్ధన్ రెడ్డి, మహమ్మద్ నగర్ సొసైటీ చైర్మన్
