హైదరాబాద్ గురుకులాల్లో మంత్రి అడ్లూరి ఆకస్మిక తనిఖీ..విద్యార్థుల సమస్యలపై ఆరా

హైదరాబాద్ గురుకులాల్లో మంత్రి అడ్లూరి ఆకస్మిక తనిఖీ..విద్యార్థుల సమస్యలపై ఆరా

హైదరాబాద్, వెలుగు: గురుకులాల విద్యాలయాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ లోని చైతన్యపురి, ఇబ్రహీంపట్నం, సరూర్ నగర్ లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్ నిర్వహణ, భోజనం, తాగునీరు, పారిశుధ్యం, భద్రత, బోధన తదితర అంశాలపై ఆరా తీశారు. మూడు విద్యాసంస్థలు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కు ఫోన్​చేసి చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గురుకులాలను దేశంలోనే ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు సర్కార్ కృషి చేస్తోందని తెలిపారు. అంతకుముందు గురుకులాల టీచర్లతో మంత్రి సమావేశమయ్యారు. ఆయన వెంట ఎస్సీ గురుకుల సెక్రటరీ శారద, ప్రిన్సిపల్స్, టీచర్లు ఉన్నారు.