ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు చెక్ పెట్టేలా రోహిత్ వేముల చట్టం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు చెక్ పెట్టేలా రోహిత్ వేముల చట్టం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  • సమగ్ర విధివిధానాలతో డ్రాఫ్ట్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
  • కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం

హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్యాసంస్థల్లో పేద విద్యార్థులపై జరుగుతున్న వివక్షకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం సెక్రటేరియట్‌‌లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన "రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు–2026" రూపకల్పనపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ విద్యాసంస్థల్లో వివక్ష లేని ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం చట్టాన్ని పటిష్టంగా రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌‌సీయూ)లో జరిగిన రోహిత్ వేముల విషాద ఉదంతం కేవలం తెలంగాణనే కాకుండా దేశం మొత్తాన్ని కదిలించిందని గుర్తుచేశారు.

కొత్త చట్టానికి సంబంధించిన సమగ్ర విధివిధానాలతో కూడిన ప్రాథమిక ముసాయిదా (డ్రాఫ్ట్) నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత శాఖ కార్యదర్శిని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కర్ణాటకలో ఇప్పటికే ఇలాంటి చట్టం కోసం ముసాయిదాను రూపొందిస్తున్నారని, అక్కడి ఉత్తమ పద్ధతులను కూడా పరిశీలించి స్వీకరించాలని సూచించారు. చట్టం రూపకల్పనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని తెలిపారు.

వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన, ఫీడ్‌‌ బ్యాక్ ఆధారంగానే బిల్లులో తుది మార్పులు, చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. రోహిత్ వేముల చట్టానికి భవిష్యత్​లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు అడ్వకేట్, సామాజిక కార్యకర్త దిశా వాడేకర్‌‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి చర్చించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.