Virat Kohli Record: కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుటైన తర్వాత వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో అద్భుతమైన స్ట్రెయిట్ డ్రైవ్‌తో బౌండరీకి తరలించి పరుగుల ఖాతా ఓపెన్ చేశాడు. ఈ క్లాసిక్ ఫోర్‌తోనే ఇంగ్లాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా ఇప్పటి వరకు రాహుల్ ద్రావిడ్ (2,645 పరుగులు) పేరుపై ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు.
కింగ్ కోహ్లీ సరికొత్త ఆరంభం:
ఈ చారిత్రాత్మక రికార్డుకు కార్డిఫ్ మైదానంతో ఒక అద్భుతమైన సెంటిమెంట్ ముడిపడి ఉంది. సరిగ్గా 2011లో ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఏకైక వన్డే సెంచరీ సాధించింది ఈ సోఫియా గార్డెన్స్ పిచ్‌పైనే. విశేషమేమిటంటే, ఆ మ్యాచ్ లెజెండరీ బ్యాటర్ రాహుల్ ద్రావిడ్ కెరీర్‌లో ఆఖరి వన్డే మ్యాచ్. నాడు ద్రావిడ్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అదే మైదానంలో, నేడు అతని పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది.
ఆసియా ఖండంలోనే నంబర్ వన్ ప్లేయర్:
ఈ అరుదైన మైలురాయితో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన ఏషియన్ బ్యాటర్‌గా కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌లో 59 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 2,646 కంటే ఎక్కువ రన్స్ కొట్టి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రేసులో సచిన్ టెండూల్కర్ (2,626 పరుగులు), రోహిత్ శర్మ (2,317 పరుగులు)లను వెనక్కి నెట్టి కోహ్లీ టాప్‌లో కొనసాగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ బ్యాటర్ల పరంగా చూస్తే సర్ వివ్ రిచర్డ్స్ (3,402), స్టీవ్ స్మిత్ (3,348), రికీ పాంటింగ్ (2,833), అలాన్ బోర్డర్ (2,799) మాత్రమే ప్రస్తుతం కోహ్లీ కంటే ముందున్నారు.
►ALSO READ | లాస్ మాల్వినాస్ బ్యానర్‌తో అర్జెంటీనా.. ఫాక్‌లాండ్స్‌పై పాత గొడవ రీ-స్టార్ట్!
ఇంగ్లాండ్‌లో కింగ్ కోహ్లీ అల్టిమేట్ రికార్డ్స్:
ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డ్ ఎంతో అద్భుతంగా ఉంది. అతను ఇక్కడ 17 టెస్ట్ మ్యాచ్‌లలో 33.21 సగటుతో 1,096 రన్స్ చేశాడు. అలాగే 35 వన్డేలలో ఏకంగా 51.03 సగటుతో 1,378 కి పైగా పరుగులు సాధించాడు. టీ20 విషయానికొస్తే 7 మ్యాచ్‌లలో 192 రన్స్ చేశాడు. మొత్తంగా ఇంగ్లాండ్ గడ్డపై 3 సెంచరీలు (రెండు టెస్టుల్లో, ఒకటి వన్డేల్లో) నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న కోహ్లీ ఈ మ్యాచ్‌లో మరింత భారీ స్కోరు సాధించి మరికొన్ని రికార్డులను తిరగరాయాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
