చంద్రయాన్-3 విజయంతో ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్న భారత్.. ఇప్పుడు గగన్‌యాన్, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్, కొత్త ఉపగ్రహాల ప్రయోగాలు, అంతరిక్ష పరిశోధనలతో మరో చారిత్రక దశలోకి అడుగుపెడుతోంది. అయితే ఈ కీలక సమయంలోనే ISROలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రాజెక్టులపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్(DoS) కీలక నిర్ణయాలు తీసుకుంది.
100 మందికిపైగా శాస్త్రవేత్తల రాజీనామా..
రిపోర్ట్స్ ప్రకారం గత కొన్ని నెలల్లో ఒకరు కాదు ఇద్దరు కారు ఏకంగా 100 మందికి పైగా సైంటిస్టులు ఇస్రోకు రాజీనామా చేశారని సమాచారం. వీరిలో గగన్‌యాన్ వంటి అత్యంత కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కూడా ఉండటం అధికారులను ఆందోళనకు గురి చేసింది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు సంస్థను విడిచిపెడితే ప్రాజెక్టుల స్పీడ్, క్వాలిటీ, ప్రాజెక్ట్ టైం లైన్ పై ప్రభావం పడే అవకాశం ఉందని DoS భావిస్తోంది.
రాజీనామాలపై కొత్త రూల్స్..
జూలై 14న విడుదలైన అంతర్గత మెమో ప్రకారం గగన్‌యాన్, ఇతర జాతీయ ప్రాధాన్య మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్-ఏ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవీ విరమణలను ఇకపై సాధారణ పరిపాలనా ప్రక్రియగా పరిగణించరు. ఇప్పటి వరకు ఈ అభ్యర్థనలను సంబంధిత కేంద్రాల డైరెక్టర్లు ఆమోదించేవారు. ఇకపై అన్ని దరఖాస్తులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కు పంపి అక్కడి తుది అనుమతి పొందాల్సి ఉంటుంది. దీంతో నిర్ణయాధికారం పూర్తిగా కేంద్ర స్థాయికి మారిపోయింది.
ప్రైవేట్ స్పేస్ రంగం ప్రభావమేనా?
రాజీనామాలకు అధికారిక కారణాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించలేదు. అయితే దేశంలో ప్రైవేట్ స్పేస్ రంగం వేగంగా విస్తరించడం, స్టార్టప్‌లు, ఏరోస్పేస్ సంస్థలు అనుభవజ్ఞులైన ISRO శాస్త్రవేత్తలకు ఆకర్షణీయ అవకాశాలు కల్పించడం ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల నిపుణులపై డిమాండ్ మరింత పెరిగిందని చెబుతున్నారు.
ఆంక్షలతోనే సమస్య పరిష్కారమవుతుందా?
ఇస్రో మాజీ అధికారులు మాత్రం రాజీనామాలను అడ్డుకునే పరిపాలనా ఆంక్షలు మాత్రమే సరిపోవని అంటున్నారు. సైంటిస్టులను ఇస్రో వీడి వెళ్లకుండా నిలబెట్టుకోవాలంటే కెరీర్ గ్రోత్, లీడర్ షిప్, పని వాతావరణం, ప్రోత్సాహక వ్యవస్థలను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇప్పటికే గతంలో కూడా ఐదేళ్ల కాలంలోనే దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు ISROను వీడినట్లు ఆర్టీఐ ఆధారిత నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గగన్‌యాన్ వంటి ప్రతిష్ఠాత్మక మిషన్ల ముందు కేంద్రం తీసుకున్న తాజా చర్యలు ఎంతవరకు ఫలిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
